కథానిక
(రాయలసీమ మాండలికం)
జెండా రోజూ ఎగరల్ల
- డా।। సి. జయ శంకర బాబు
అయ్య అమ్మ
అక్క అన్న అందరూ
గాసానికి రెక్కాడిస్తేనే
అబ్బిగాడి మూతికి మెతుకు దక్కేది
ఇక వాడి డొక్కకు గుడ్డెక్కడిది!
సదువు సందె మాట
దేవుడెరుగు!
“పిల్లాడిని బడికి పంపీండని”
అయివారమ్మలంటే
“గతికేకి మెతుకే కరువు
అతికేకి కోకా కరువు
మాకేటికమ్మా సదవు”
అంది అబ్బిగాడి అమ్మ.
ఓటేసికి పోతే
అబ్బిగాడి అయ్యకు
దక్కిందొక జెండాగుడ్డ
సించి అతుకులేస్తే అదే
అబ్బిగాడికి నిక్కరూ సొక్కా!
సొక్కా నిక్కరు తొడిగిన అబ్బిగాడు
బడంటే ఏందో సూద్దామని పోతే
ఊరూ గేరులో ఉండే పిల్లగాళ్ళంతా
ఆడ సుట్టూ నిలబన్నారు
మద్దెలో ఓ గుంజ పాతినారు
దానికి తాడు గట్టినారు
గుసగుసలాడే బడిపిల్లల మాటలు
అబ్బిగాని సెవిన పన్నాయ్ -
“రోంచేపుంటే శాకిలెట్టిత్తారంట”
ఆశతో జొల్లుగారుస్తూ
అబ్బిగాడు నిలబన్నాడు.
బడిపిల్లల గుంపులో
అయ్యవారొచ్చి
గుంజకుండే తాడు ఇట్టాఇగ్గితే
పూలూ రంగుకాయితాలూ రాలినాయి
అంతా తలకాయిపైన సెయిపెట్టి
పైకి సూత్తాంటే
అబ్బిగాడూ సూసినాడు
ఓ గుడ్డ పేలిక గాలికెగురుతాంది
రత్తం లాగ ఎర్రగా
సున్నంలాగ తెల్లగా
ఆకులాగ పచ్చగా ఉంది
నడాన బండిసెక్రం
అబ్బిగాడి బుర్రలో ఏందో మెదిలింది...
“అయ్యకు సెప్పితే …”
ఇంతలో “జన గణ మన….” అంటూ
అంతా ఏదో పాడుతున్నారు
చివరికి “జయ జయ…” అంటుండగా
అబ్బిగాడు కూడా అరిసినాడు
“జై జై” అని
“ఇంగ అందరూ వర్సగా బల్లోకి పోండి
శాకిలెట్లిస్తారు”
పొడూగుండే పోరగాడన్నాడు.
పిల్లగాల్లంతా లోపలికి పోతాంటే
ఆడే గోడ పంచన నిలబన్నాడు
అబ్బిగాడు బిక్కుబిక్కుమంటూ
బల్లో అందరికీ శాకిలెట్లు పంచినంక
ఒగయివారొచ్చి బైట నిలబడిండే
పిల్లగాల్లకి సాకిలెట్లిచ్చినాడు
అబ్బిగాడికీ ఒగటి సిక్కింది
జోబులోబెట్టుకోని
ఇంటికి పారొచ్చి
అమ్మకీ అయ్యకీ
అక్కకీ అన్నకీ
సూపిచ్చి
“బల్లో జెండా ఎగిరేసినారు
నాకూ శాకిలెట్టిచ్చినారు”
అని వాడు సప్పరిస్తాంటే
సోతంత్రమంటే
అంత తియ్యగా ఉంటాదని
వాడి అమ్మకు, అయ్యకు
అన్నకు, అక్కకు అనిపించింది
“జెండా రోజూ ఎగరల్ల”
అబ్బిగాడు ఆశతో అన్నాడు
శాకిలెట్టు జుర్రుకుంటూ...
కవిత
గణతంత్రం .... మనకు శ్రేయో మంత్రం
- డా।। సి. జయ శంకర బాబు
జన గణ మన ఆశల ఫలితం
భారతానికి దక్కిన స్వాతంత్ర్యం
ఘనకీర్తి గలిగిన భారతీయ వీరుల
ఐకమత్య పోరాటాలకు
దక్కిన సుఫలం గణతంత్రం
జనులెల్లరకూ సమానాధికారాన్ని
కట్టబెట్టే జనస్వామ్యాన్ని
ఆదరించి అలవర్చుకున్నాం
భాషలెన్నైనా భావమొక్కటేనంటూ
రంగురూపాలేవైనా
భారతీయులందరూ ఒకటేనంటూ
క్రమశిక్షణే జాతి లక్షణంగా
ఐకమత్యమే మహాబలంగా
జన గణాల చైతన్య గమనంతో
సార్వభౌమాధికార సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య
గణతంత్రంగా వర్ధిల్లింది భారతావని
నేడు మన గణతంత్రానికి షష్టిపూర్తి
అరవై వసంతాలు పూర్తిచేసుకున్న
భారత గణతంత్రం
జగతిలోకెల్ల గొప్ప జనస్వామ్యంగా,
మారుతున్న ప్రపంచానికి మార్గదర్శిగా
అన్నింటా ముందంజంగా
అడుగులు వేస్తోంది.
శాంతికాంక్షతో మనం
అజాత శత్రువులుగా వర్ధిల్లాలనుకున్నా
అతివాదం అట్టహాసంగా
శాంతి పావురాన్నే
మింగేస్తానంటూంటే
జాతి రక్షణే ధ్యేయంగా
మన జవానులు
సన్నద్దులై ప్రాణాలొడ్డుతున్నారు
పోరులూ, ఆర్థిక మాంధ్యాలు
కరువులూ కాటకాలు
ప్రపంచాన్ని పీడిస్తున్నా
సస్యశ్యామల భారతావని
తన జన గణాలనెల్లా
చల్లగా కాపాడుతోంది
భారత గణతంత్రానికి
నేడు అరవయ్యవ వసంతోత్సవం
మనకందరికీ ఇది ఆనందోత్సవం
భాషకొక రాష్ట్రమంటూ
భాగాలేనాడో పంచుకున్నాం
మరళా ఇప్పుడు
కుండలు పంచుకోవటమేంబాగు ?
మన భాషలన్నీ
భారతమాత పలుకు తేనెల తియ్యదనమే
ఇప్పుడు మాది పాత మీది రోతంటూ రోషాలెందుకు
మాది గొప్ప మీది దిబ్బ అనే వేషాలెందుకు
భాషయేదైనా మన మధ్యన ప్రేమను పెంచేందుకేగాని
ద్వేషాగ్నిని రగిలించేందుకు కాదుగదా!
మనలో మనకు పోటీలెందుకు?
హిందువులైనా, మహమ్మదీయులైనా
క్రైస్తవులూ, జైన, బౌద్ధ, సిక్కు, జొరాష్ట్రియనులైనా
మనమంతా మానవీయతను కోరుకునే
భారతీయులమే కదా!
మరి మన మధ్య విభేదాలెందుకు?
జనలందరికీ సమానాధికారాన్నిచ్చిన
జనస్వామ్యంలో
కూడూ, గూడు, గుడ్డతో పాటు
మానం మర్యాదలుంటే చాలు కదా!
దౌర్జన్యాలూ, అవినీతి దారులూ
లంచగొండి దగా బతుకులెందుకు?
భారతీయులంతా ఆత్మీయభావంతో
ఐకమత్యంతో క్రమశిక్షణతో ఉంటే
శ్రమయే సేవగా భావించి
చైతన్యజీవనం సాగిస్తే
కరువులూ కాటాకాలూ
చోరులూ కిరాతకులూ
ఎవరూ మనల్నేమీ చేయలేరు
దేశమాత సేవకై
శిరసువంచి నిలబడే జనగణాలుంటే
జాతికి గణతంత్రం
అదే మనకు శ్రేయోమంత్రం!
మన జాతీయ ఝండా
రెప రెపలాడుతూ
మనందరికీ శాంతిసౌభాగ్యాలనందిస్తూ
నేటికి అరవై వసంతాలు పూర్తిచేసుకుంటోంది
ప్రతి అడుగూ ప్రగతి వైపే అంటూ
జగతికి తలమానికమైన భారతావణి
మనందరికీ గర్వకారణం...
జయహే జయహే భారతమాతా
నీకివే మాజోహార్లు
జై భారత్!
1 comment:
rayalaseema maandalikam chaala bhramandanga undi,mari konni kavitalu ee aasalo raya mani korutunnanu.
Post a Comment