
చీకటితో పోరాడటానికి స్వప్నం తప్పనిసరి
- విశ్వరంజన్
సగం తెరచిన కిటికీ నుండి తొంగిచూస్తున్న చీకటి
టేబుల్ పై ల్యాంపు వెలుతురు మరచినట్టు కూచుంది
ముడుచుకు పోయిన గుండ్రటి చిన్న పచ్చటి సూర్యునిలా
తెరచిన పుస్తకపు పటపటలాడుతున్న పేజీలు
ఎవరూ లేరు నేడిక్కడ
ఎందుకు ?
సాయంత్రం సూర్యుడు దాక్కుంటాడు
హృదయపు నల్లటి ఆకాశంలో
గడ్డి పసుపుదై పోతుంది చివరి వెలుతుర్లో
మరణాసన్నమైన ఆకులు చివరిమాట చెబుతాయి బహుశా
గాలి బరువెక్కి తొంగిచూస్తుంది సగం తెరచిన కిటికీ నుండి
టేబుల్ పై ల్యాంపు వెలుతుకు పరచుకొంటుంది
తెరచిన పుస్తకపు పేజీలు పటపటలాడుతాయి
అంతే ఇక్కడ ఎప్పుడూ ఏమీ కాదనిపిస్తుంది
ఇదంతా తెలిసికూడా
నేను ఓటమిని ఒప్పుకోను
నా పిల్లలకు అప్సరసల కథలు చెబుతాను నేను
వారిని అప్సరసల లోకాల్లో విహరింపజేస్తాను
వారికి క్రొత్త వెలుగును చూపిస్తాను
క్రొత్త పూల గుంపు
వారి మనసుల్లో నింపుతాను
ఒక సరికొత్త నగరపు
పునాదులు వేస్తాను వారిలో
వారి కళ్ళలో స్వప్నాన్ని పుట్టిస్తాను
నాకు తెలుసు
చీకటితో పోరాడటానికి
ఒక క్రొత్త స్వప్నం తప్పనిసరియని
(హిందీ మూలం – విశ్వరంజన్ - తెలుగు అనువాదం – డా।। సి. జయ శంకర బాబు)
