Wednesday, July 23, 2008

అనుసృజన anusrijana TRANSLATION

కథ


భార్య

హిందీ మూలం – జైనేంద్ర కుమార్

తెలుగు అనువాదం – డా. సి. జయ శంకర బాబు

ఊరికి ఓమూలన ఉన్నది ఆ ఇల్లు. ఆ ఇంట్లో మొదటి అంతస్తు. అక్కడ వరండాలో ఒక స్త్రీ కుంపటి ముందు కూర్చొని ఉంది. కుంపట్లో నిప్పులు బూడిదైపోతున్నాయి. ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంది. దాదావు ఇరవై - ఇరవై రెండు మధ్య వయసు ఉండవచ్చు. చూడటానికి బక్క పలుచగా, మంచి సంస్కారవంతమైన కుటుంబానికి చెందినదిలా ఉంది.
ఉన్నట్టుండి ఆమె ధ్యాస నిప్పులు బూడిదైపోతున్న కుంపటి వైపు మళ్ళింది. మోకాటిపై చేతులు మోపి ఆమె పైకి లేచింది. కొన్ని బొగ్గులు తెచ్చి కుంపట్లో వేసి మళ్ళీ ఓ మూలన కూర్చుంది, ఇప్పుడేంచేయాలో గుర్తు చేసుకుంటున్నట్లు. ఇంట్లో ఎవరూ లేరు. సమయం మధ్యాహ్నం పండ్రెడు కావస్తున్నది.
ఈ ఇంట్లో ఉంటున్నది ఇద్దరు జీవులే, భార్య – భర్త. భర్త ఉదయాన వెళ్ళి ఇప్పటిదాకా తిరిగి రాలేదు. భార్య వరండాలో కూర్చొని ఉంది.
ఆమె సునంద.... ఆలోచిస్తూ ఉంది - లేదు, తనెక్కడ ఆలోచిస్తోంది, అలసట చెంది అలా అక్కడ కూర్చొని ఉంది. ఆలోచించడమంటే ఒక్కటే..... అదేమంటే నిప్పులు ఆరిపోకూడదు అని. ఆయన ఎప్పడొస్తాడో మరి. ఒంటిగంట అవుతోంది. ఏది ఏమైనా, ఆయన తన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా.... ఇంకా సునంద కూర్చొనే ఉంది. ఆమె ఏమీ చేయటం లేదు.
ఆయన వచ్చినపుడు రొట్టె చేసి పెడుతుంది. ఆయన ఎక్కడుండి ఇంత ఆలస్యం చేస్తాడోమరి. తను మాత్రం కూర్చోలేకపోతోంది. నిప్పులు రాజుకున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా కుంపటిపై పెనం పెట్టేసింది. ఇలా చూస్తూ ఉంటే కాదు, ఇక తను రొట్టె చేసేస్తే సరి. ఆమె గభాలున పిండి ఉన్న పాత్రను దగ్గరికి లాగి రొట్టెలు చేయడం మొదలు పెట్టింది. కొద్ది సేపటి తర్వాత మెట్లపై పాదాల చప్పుడు వినిపించింది. ఆమె ముఖంలో వెలుగు నిండి క్షణంలో ఆ వెలుగు ముఖంపై నుండి మాయమైపోయింది. ఆమె అలానే తన పని చేస్తూ ఉండి పోయింది.
భర్త కాళిందీచరణ్ వచ్చాడు. తనతో పాటు ఆయన ముగ్గురు మిత్రులు కూడా వచ్చారు. వారు తమలో ఒకరితో ఒకరు మాట్లాడుతూ వస్తున్నారు.... చూస్తే చాలా ఉత్తేజంగా అగుపిస్తున్నారు. కాళిందీచరణ్ తన మిత్రులతో పాటు సరాసరి తన గదిలోనికి వెళ్ళిపోయాడు. వారి మధ్య ఏదో చర్చ జరుగుతోంది. గదిలోనికి ప్రవేశించగానే ఆగిన చర్చ మళ్ళీ మొదలైంది. ఆనలుగురూ దేశాన్ని ఉద్ధరించాలని నడుం బిగించిన వాళ్ళు. అదే విషయమై చర్చ జరుగుతోంది. భరతమాతకు స్వాతంత్ర్యం సంపాదించాలి.... నీతి-అవినీతి, హింసా-అహింసల గురించి ఆలోచించేందుకు ఇది సమయం కాదు. తియ్యటి మాటలతో ఒరిగేదేంటో చాలా చూశాము. పులి నోట్లో పెట్టిన తలను తియ్యటి మాటలతో తియ్యలేము. అటువంటి­­ సమయంలో పులిని చంపడమే ప్రత్యామ్నాయము. ఉగ్రులవ్వాలి! అవును ఉగ్రతే. తీవ్రవాదమంటే మనం ఎందుకు భయపడాలి? ప్రజలంటారు తీవ్రవాదులని, మూర్ఖులని, ఏమీ ఎరుగని పిల్లతనమని..... అవును పిల్లగాళ్ళూ, మూర్ఖులూనూ, వారికి పెద్దరికం, బుద్ధి కల్గినతనం అక్కరలేదు... మనకు జీవించాలనే కోరిక లేదు. మనకు పిల్లల పట్ల మోహమూ లేదు. ధన సంపదలు అర్జించాలన్న ధ్యాస లేదు. అలాంటప్పుడు మనకు చచ్చేందుకు స్వేచ్ఛ ఎందుకు లేదు? దౌర్జన్యాన్ని ఆపటానికి కొంత దౌర్జన్యం జరగవలసిందే. దౌర్జన్యమంటే భయపడేవాళ్ళే దానికి భయపడాలి. మనం యువకులం, మనకు భయంలేదు.
చర్చను కొనసాగిస్తూ తాము ఏం చేయాలన్నది నిర్ణయించసాగారు.
ఇంతలో తాను భోజనం చేయలేదనే ధ్యాస కాళిందీచరణ్ కు కలిగింది, తన మిత్రుల భోజనం గురించి కూడా అడగలేదే అన్పించింది. మిత్రులతో క్షమించమని అడిగి సునంద కోసమై వెలుపలికి వచ్చాడు.
సునంద ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంది. ఆమె రొట్టెలు చేయటం పూర్తి చేసింది. కుంపటిపై అప్పడే మూతపడి ఉంది. చేతివేళ్ళపై తల ఆన్చి ఆమె కూర్చోనిఉంది. ఏదో కోల్పోయినదానిలా కన్పిస్తున్నది. భర్త కాళిందీచరణ్ తన మిత్రులతో ఎందుకు – ఏమి మాట్లాడుతున్నాడో వింటూ ఉంది. ఆ ఉత్తేజానికి కారణం ఆమెకు బోధపడదు. ఉత్సాహమంటే ఏమిటో తెలియదు. అది ఆమెకు దూరమైన వస్తువు.... స్పృహనీయమైన, మనోహరమైన భావన. భారతమాతకు స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుసుకోవాలని ఆమె తపన. కానీ ఆమెకు భరతమాతా అర్థం కాదు, స్వేచ్ఛయూ తెలిసిరాదు. వాళ్ళు ఉత్తేజంతో మాట్లాడుకుంటున్న మాటలకు అర్థం ఆమెకు తెలియదు. కానీ, ఉత్సాహంకోసం ఆమె తపిస్తూ ఉంటుంది. జీవితంపై ఆశ సన్నగిల్లుతూ ఉంది, అయినా ఆమెకు జీవించాలని ఉంది. భర్త తనతో దేశం గురించి మాట్లాడాలని ఆమె ఆశ. తనకు బుద్ధి కొంచెం తక్కువే... అయినా నిదానంగా విషయాన్ని అర్థం చేసుకోలేక పోదు కదా? ఆమె ఆలోచనలో మునిగిపోయింది. అవును తక్కువ చదివినదాన్నే అయినా ఇందులో నా తప్పేముంది? ఇప్పుడు నేను చదవటానికి సిద్ధమే, కానీ భార్య పట్ల భర్తకు బొత్తిగా నమ్మకం కుదరటం లేదు. ఓహ్ ఆయనేమో సేవ చేయడమే దీని పని అనుకున్నాడు. అంతే, ఇది తెలిసే ఏదీ తెలుసుకోవాలన్న కోరికను కూడా వదులుకున్నాను. ఆమె ఎప్పుడూ భర్త దారికి అడ్డురావాలని ఆలోచించదు, అప్రయత్నంగానే భర్తకు సహకరిస్తుంది. ఒక్క విషయం మాత్రం ఆమెకు తెలుసు... భర్త అసలు విశ్రమించడమంటే ఎరుగకపోవటం, అన్నీ తెలిసి ఏదో పోగోట్టుకొన్నవాడిలా అలా తిరుగుతూ ఉంటాడు, ఇందులో ఆయన ఏదో మంచే ఆలోచిస్తుంటాడు. ఇలా భావించే తను ఎటువంటి అడ్డూ అదుపూ లేకుండా భర్తతో పాటు విపత్తులపై విపత్తులు కొనితెచ్చుకుంటోంది. నువ్వు నాతోపాటెందుకు కష్టపడుతున్నావని భర్త తనను ప్రశ్నించాడు కూడా. అయినా విని తను మిన్నకుండిపోయింది. ప్రభుత్వమని దేన్నయితే అంటున్నారో ఆ ప్రభుత్వమే వారి ఇటువంటి పనుల పట్ల చాలా కోపంతో ఉంది. ప్రభుత్వము ప్రభుత్వమే. ప్రభుత్వమంటే ఏమిటో ఆమెకు స్పష్టంగా బోధపడుట లేదు, అయినా పాలకుల పేరిట ఎందరైతే ఉన్నారో, వారంతా ఎంతో బలం కలిగి ఉంటారు, వారి వద్ద ఎన్నో బలీయమైన శక్తులుంటాయని, ఇంతటి సైన్యం, పోలీసు సిపాయిలు, మేజిస్ట్రేట్లు, మున్షీలు, చప్రాసీలు, జైలు అధికారులు, వైస్రాయ్ వీరంతా ప్రభుత్వమే. వీరందరితో ఎలా పోరాడటం. పాలకులతో వైరము మంచిది కాదు, అయినా ఈయన వారితో పోరాడటానికి తనువు-మనువు మరిచాడు. అది సరే, వీళ్ళంతా ఇంత బిగ్గరగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదే తనకు నచ్చదు. మామూలు దుస్తుల్లో (మఫ్తీ) గూఢాచారి పోలీసు ఎప్పుడూ ఈ ఇంటి బయటే తచ్చాడుతూ ఉంటాడు. వీళ్ళు ఆవిషయమెందుకు మర్చిపోతున్నారు? ఇంత బిగ్గరగా ఎందుకు మాట్లాడుతారు?
ఇటువంటి విషయాలే ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయింది. అదిగో, సమయం రెండు కావస్తున్నది. ఆయనకు తిండి ధ్యాస లేదు, నా ధ్యాస లేదు. నా గురించి లేకున్నా ఫరవాలేదు, కనీసం తన ఒళ్ళు గురించైనా ధ్యాస ఉండాలి కదా. ఇలాంటి నిర్లక్ష్యంవల్లే పిల్లవాడుకూడా దక్కలేదు. ఆమె మనసును ఎటుమళ్ళించినా, అది అటూ-ఇటూ తిరిగి చివరికి సంతానలేమి విషయంవైపే మల్లుతుంది. అప్పుడు ఆమెకు పోగోట్టుకున్న తన కోడుకు జ్ఞాపకాలే వస్తాయి – అందమైన పెద్దకళ్ళు, చిట్టి-చిట్టి వ్రేళ్ళు, ముద్దొచ్చే చిట్టి-చిట్టి పెదవులూ. అన్నీ ఇవే జ్ఞాపకాలు. పిల్లచేష్టలూ గుర్తుకు వస్తాయి. అన్నింటికి మించి వాడి చావూ గుర్తుకొస్తుంది. ఓహ్, అదెటువంటి చావు? ఆ చావును ఆమె చూడలేని స్థితి. పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదని ఆమెకు తెలుసు – తనూ చావాల్సిందే, తన భర్తయూ చావాల్సిందే, కానీ పసిగుడ్డు ప్రాణం పోగొట్టుకున్న తీరు జ్ఞాపకం వచ్చిన క్షణం భయం ఆమెను ఆవహిస్తుంది. ఇది సహించడం ఆమె వల్ల కాదు. పిల్లాడి జ్ఞాపకం ఆమెను కలచివేస్తుంది. అప్పుడు ఆమె దుఃఖభారంతో కళ్ళు తుడుచుకుంటూ ఉన్నట్టుండి ఏదో పని వెదుక్కోవాలని ప్రయత్నిస్తుంది. కానీ ఒంటరిగా ఉండటంవల్ల తను ఏమి చేసినా మళ్ళీ మళ్ళీ అదే దృశ్యం – అదే తన పసిగుడ్డు ప్రాణం తనముందే పోతున్నట్టు, ఇలానే ఆమె మనసు దైన్యస్థితికి చేరుకుంటుంది. ఆమె లేచింది. ఇప్పుడు లేచి వంట పాత్రలు కడగాలి, వరండా కూడా శుభ్ర పరచాలి. ఓహ్, ఖాళీగా కూర్చోని నేనేం ఆలోచిస్తున్నాను.
ఇంతలో కాళిందీచరణ్ వరండాలోకి వచ్చాడు. సునంద అన్యమనస్కంగానే ఉండిపోయింది. తను భర్త వైపు చూడలేదు.
కాళిందీ అడిగాడు – సునందా భోజనానికి మేము నలుగురున్నాము. వంట పూర్తయిందా ?
సునంద పిండి కలిపిన కంచం, పీట, లక్కెన, బానలి మొదలైన ఖాళీ పాత్రలు తీసుకొని లేచి పోయింది, ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
సునంద ఏమీ మాట్లాడలేదు. ఆమె మనసులో కోపం పెల్లుబుకుతోంది. క్షమాయాచకురాలైన తనతో ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇంకొంచెం అన్నం వండమని నవ్వుతూ ఎందుకు చెప్పడు. నేనేదో పరాయిదాన్నయినట్లు. మంచిది, నేనేం బానిసనుకాదు కదా, ఈయన పనే చేస్తూఉండటానికి. అన్నం గిన్నం నాకేం తెలియదు. ఆమె మిన్నకుండి పోయింది.
కాళిందీచరణ్ గట్టిగా పిలిచాడు – సునందా.
తన చేతిలోనున్న బానలిని విసిరి కొట్టాలనిపించింది సునంద మనసులో. తను ఎవరికోపాన్నీ సహించేందుకు లేదు. ఇంతవరకు తను భర్తగురించి, ఆయన బాగోగులు గురించి ప్రీతికరమైన విషయాలెన్నో ఆలోచిస్తూ ఉండిపోయిన సంగతి ఆమె జ్ఞాపకాలజాడలోనికి రాలేక పోయింది. ఇప్పుడు కోపంతో లోలోపలే నలిగిపోయింది.
ఏం మాట్లాడలేవా ?
సునంద మాట్లాడలేదు.
సరే మంచిది. మేమెవ్వరూ తినం.
ఇలా అంటూ ఉద్రేకంతో కాళ్ళు చరస్తూలోనికి వెళ్ళిపోయాడు.
కాళిందీచరణ్ తమదళంలో ఉగ్రుడని ఎప్పుడూ అనిపించుకోలేదు, ఎంతోకొంత ఉదారుడే అనించుకొన్నాడు. తమదళంలో ఉన్నది చాలావరకు అవివాహితులే, కాళిందీచరణ్ వివాహితుడు మాత్రమే కాదు, ఒక కొడుకును పోగుట్టుకొన్నవాడు కూడాను. ఆయనమాటంటే దళంలో ఎంతోగౌరవం. ఆయన నెమ్మదితనం కొందరికి పడదుకూడాను. తమదళంలో వివేకానికి ఆయన ప్రతినిధి. ఉద్వేగానికి అంకుశంలా వ్యవహరిస్తుంటాడు.
ఇదే విషయమే తమ చర్చలోను చోటు చేసుకుంది. తాము ఉగ్రవాదాన్ని వదిలేదిశగా కదలాలన్నది కాళిందీ అభిమతం. ఉగ్రవాదంలో వివేకం అవిటిదైపోతుంది. దీంతో మనిషి ఉగ్రుడిగా ఉండిపోతాడు లేదా దాని భయంతోటే అణిగి ఉంటాడు. ఈ రెండు పరిస్థితులూ మంచివి కావు. బుద్ధిని నలువైపులనుండి వికసింపజేయటమే మన లక్ష్యం. దాన్ని తీవ్రతరం చేయటం మాత్రమే కాదు. ప్రభుత్వం వ్యక్తి, జాతి వికాసమే లక్ష్యంగా దాన్ని అణచివేయాలని చూస్తుంది. మనం ఈ వికాసమార్గంలో అవరోధాల్ని తొలగించాలన్నదే మన కోరిక. దీన్ని స్వేచ్ఛాయుతం చేయాలన్నదే మన తపన. తీవ్రవాదంతో ఇది సాధ్యం కాదు. అధికారమదంతో ఉన్మత్తులయిన వారి మదాన్ని అణచి, వారిలో కర్తవ్యభావాన్ని నింపటమే మన అసలైన కార్యం. వారిలోని ఆ మదం వారికి ఎదురుతిరిగి దెబ్బతినే అణుగుతుంది. ఇటువంటి దెబ్బతీయటానికి మనం సన్నద్దులై ఉండాలి, అంతేకానీ ఇలాంటి చిరు తగవులు మంచివి కావు. ఇలాంటివాటిచే ప్రభుతకు జరిగే నష్టమేమీ ఉండదుగానీ, తన ఔచిత్యంపై ఎంతో హర్షిస్తుంది కూడా.
కానీ సునంద దగ్గరికెళ్ళి తిరిగి వచ్చాక కాళిందీ మాటల్లో తేడా కనిపించింది. తన పంథాపై తాను ధృఢంగా ఉన్నట్టు అనిపించలేదు. ఇప్పుడు తను ఉగ్రవాదం కూడా అనివార్యమే అనే ధోరణికి వచ్చాడనిపించింది. అవును, మనం ఒక పని తప్పక ఆరంభించాలి అంటూ మీకు ఆకలిగా లేదా? ఆమె ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఇక్కడ బోజనం తయారుకాలేదు. ఏం చేద్దాం చెప్పండి? ఎక్కడైనా హోటలుకు వెళ్దామా? అన్నాడు కాళిందీ.
బజారునుండి ఏదో ఒకటి ఇక్కడికే తెచ్చుకుంటే సరియని వారిలో ఒకడన్నాడు. మరొకడేమో హోటలుకు వెళ్దాం పద అన్నాడు. ఇలా వారు మాట్లాడుతున్నంతలోనే సునంద ఒక పెద్ద కంచంలో అన్నం తెచ్చి వారి మధ్య ఉంచింది. అది అక్కడ పెట్టి మళ్ళీ వెళ్ళి నాలుగు గ్లాసులలో మంచినీళ్ళు తెచ్చిపెట్టి మౌనంగా వెళ్ళిపోయింది.
కాళిందీకి పై ప్రాణం పైనే పోయినట్లయింది.
ముగ్గురు మిత్రులు ఊరకుండిపోయారు. భార్యా-భర్తలమధ్య మనస్పర్థలేవో ఉన్నాయని వారికి అర్థమైపోయింది. చివరికి ఒకడన్నాడు సరే తినడం మొదలుపెడదామా అని. ఇది మనకు చాలదేమో అన్నాడు కాళిందీ సిగ్గుతో. చాలా ఉంది, సరిపోతుందిలేనని ఇంకొకడన్నాడు.
ఇంకొంచెం ఉందేమో చూద్దును, అంటూ కాళిందీ పైకి లేచాడు.
సునంద దగ్గరికి వచ్చి – అన్నం అక్కడ తెచ్చిపెట్టమని నీతో ఎవరన్నారు? నేనేమన్నాను?
సునంద పలకలేదు.
పద వెళ్ళ ఆ కంచం తెచ్చెయ్. మేమెవరూ ఇక్కడ తినము. హోటలుకు వెళ్తాం.
సునంద మాట్లాడలేదు. కాళిందీ కాసేపలాగే నిల్చుండిపోయాడు. ఆయన మనసులోనూ, కంఠంలోనూ ఏవేవో ఆలోచనలు-మాటలు కదులుతున్నాయి. తనకు అవమానం జరిగినట్లుగా భావించాడు. ఆ అవమానం తనకు భరింపరానిది.
ఏం వినపడ్డం లేదా ఎవరేమంటున్నారో అతనన్నాడు.
సునంద ముఖం తిప్పుకుంది.
నేనరుస్తూ ఉండటానికే ఉన్నాననుకున్నావా ?
సునంద లోలోపలే కుమిలి పోయింది. నేను చెప్పివెళ్ళాక కూడా అన్నం ఎందుకు తెచ్చి పెట్టావని నేనడుగుతున్నది ? సునంద ప్రక్కకు తిరిగి జంకుతూ సన్నటి గొంతుతో – తినరా ఒగ్గంటైపోయింది.
కాళిందీకి ఏంచేయాలో పాలుపోలేదు. ఇదింకా విచిత్ర పరిస్థతిలా ఉందనిపించింది. ఇంకా అన్నం లేదా అంటూ గద్దించాడు.
సునంద మెల్లగా అంది – పచ్చడి తీసుకువెళ్ళండి.
ఇంకా అన్నం లేదా? సరే, ఆపచ్చడివ్వు.
సునంద పచ్చడి తెచ్చింది, అది తీసుకొని కాళిందీ లోనికి వెళ్ళపోయాడు.
సునంద తన కోసం కొంచమైనా అన్నం తీసిపెట్టుకోలేదు. తను కూడా తినాలి కదా అన్న తలంపైనా ఆమెకు కలగలేదు. ఇప్పుడు కాళిందీ వచ్చి తిరికి లోపలికి వెళ్ళాక తన కొరకు తాను అన్నం అట్టిపెట్టుకోలేదని అర్థమైంది. తనపై తనకే జాలి కలిగింది. ఆమె మనసు కఠోరమైంది. అవును తన కొరకు మాత్రం కాదు...ఇలా ఆలోచించినందుకు ఆమె మనసు కఠోరమైంది. ఛ! ఇలా ఆలోచించటం సరియేనా, తనలోనూ విషం నిండుతోంది. ఇలా ఆలోచిస్తూనే ఆమె మనసులో మెదిలింది మరో ఆలోచన. అది సరే, కనీసం నువ్వేం తింటావ్ అనైనా ఆయన అడగలేదే అని. తను తిని ఆయన మిత్రుల్ని ఆకలితో పంపేయాలనే తలంపులను అసలు తను సహిస్తుందా ? అయినా ఆయన అడిగితే ఏమయింది. ఈ విషయమై ఆమె మనసు కృంగిపోయింది. తనకు కాస్తో కూస్తో ఉన్న గౌరవం కూడా పోగొట్టుకొన్నట్లు ఊగి పోయింది. ఉండి ఉండి తనను తాను కించపరచుకుంటూ ఛ ఛ ! సునందా, నీకు ఇంత చిన్న విషయంపైకూడా పట్టింపా ? వారికోసం ఒకరోజు ఉపవాసమున్న పుణ్యం దక్కిందని సంతోషించాలి గానీ. అసలు నేనెందుకు ఆయనకు కోపం తెప్పిస్తున్నాను ? ఇక నుండి కోపం కలిగించను. కానీ ఆయన మాత్రం తన గురించి తాను పట్టించుకోడు. ఇది మంచిది కాదు. నేనేం చేయాలి ? తనలో తాను మథన పడి పోయింది.
లేచి పాత్రలు తోమటం మొదలు పెట్టింది. లోపల వాళ్ళేమో బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్యలో వాళ్ళ నవ్వులాటలు ఆమెకు విన్పిస్తున్నాయి. అయ్యో పాత్రలు తరవాతైనా కడుక్కోవచ్చు. లోపల వాళ్ళకేమైనా అందివ్వాలేమో ఇలా ఆలోచించి వెంటనే చేతులు కడుక్కొని లేచివెళ్ళి ఆగది తలుపు ప్రక్క గోడకు ఆనుకొని నిల్చుండిపోయింది.
ఒక మిత్రుడన్నాడు – పచ్చడి ఇంకా ఉందా ఇంకాస్త తెప్పించు గురూ
అలవాటు ప్రకారం కాళిందీ బిగ్గరగా – ఏమేయ్ పచ్చడి, పచ్చడి తీసుకురావే అన్నాడు. సునంద ఎక్కడో దూరంగా ఉన్నట్లు. కానీ ఆమె తలుపు దగ్గరే ఉంది. మౌనంగా పచ్చడి తెచ్చి పెట్టింది.
వెళ్ళిపోబోతుంటే కొంచెం అనిగిన గొంతుతో కాళిందీ అన్నాడు – కొంచెం నీళ్ళు తెచ్చిపెట్టు.
సునంద నీళ్ళు తెచ్చిపెట్టింది. బయటికి వెళ్ళి మళ్ళీ తలుపు ప్రక్కన నిలబడింది, కాళిందీ ఏదైనా అడిగితే తెచ్చిపెట్టాలని. ~
---

కవిత KAVITA

నాన్న

డా. ఎస్. బషీర్, చెన్నయ్

జీవితాన్ని, అనుభవాన్ని
శ్రమను, మేధను
అహర్నిశలు ధారపోస్తూ
శిలలను, సజీవ శిల్పాలుగా మలిచే
అద్భుత అమర శిల్పి - నాన్న


--

కుటుంబ సౌభాగ్యాన్ని
సంతాన శ్రేయస్సును కాంక్షిస్తూ
నవ తరాన్ని, భావి తరాన్ని
ప్రగతి పథం వైపుకు నడిపించే
మార్గదర్శి, దూరదర్శి నాన్న

--

కుటుంబ చరితలో...
తన వాళ్ళ నిండు మనస్సుల్లో...
మైలురాయిగా, స్థిరంగా
నిలిచిపోయే శిలాక్షరం, కీర్తి స్థంభం నాన్న

--

తనకోసం ఏమీ మిగుల్చుకోక పోయినా
తన సంతానం కోసం ఎన్నటికీ తరగని
విజ్ఞాన ధనం, సిరి సంపదలు,
ప్రసాదించే ధన్యజీవి, అమరజీవి నాన్న

--

ఐనవారి సుఖం కోసం
కొవ్వొత్తిలా వెలుగునిస్తూ
కరిగి పోయే కర్మజీవి నాన్న

--

అంధకారంలో ఉన్నా
తనవాళ్ళకు వెలుగు ప్రసాదించే
టార్చిలైటు-మార్గదర్శి నాన్న

--

తాను కాలిపోయినా
తన వారికి సువాసనలు వెదజల్లే
అగరొత్తి నాన్న

--

తాను కాలే కడుపుతో ఉన్నా
తన వాళ్ళకు పరమాన్నం పంచిపెట్టే
అక్షయ పాత్రధారి నాన్న

--

తన బతుకు అరణ్యరోదనైనా
తనవాళ్ళ బతుకుల్ని సంగీతభరితం చేసే
అద్భుత గాత్రధారి నాన్న

--

సాహితికి రచనలు ఎలా పంపాలి ?



తెలుగు సాహితీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బృహద్ ప్రయత్నంలో ఉడుతా భక్తితో తోడ్పాటునందించాలనే సత్సంకల్పంతో ఈ అక్షర యజ్ఞానికి తమ సహాయ సహకారాలతో సాహితి ఆగస్టు 2, 2008 న శ్రీకారం చుడుతుంది. ఈ చిరు ప్రయత్నానికి తమ ఆత్మీయతను అందించగలరు. దేశ భాష లందే కాక ప్రపంచ భాషల మధ్యకూడా తెలుగు వైభవాన్ని చాటిచెప్పే సులభమైన అవకాశం ఇంటర్నెట్ కల్పిస్తున్నందున మన భాషా సాహిత్యాలను ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఇది మంచి తరుణం. తెలుగులో ఉన్న పరమోత్కృష్టమైన సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయటం, వివిధ భాషలలోకి తర్జుమా చేయడం, వివిధ భాషల మాధ్యమంగా ఆయా భాషలవారికి తెలుగు నేర్చుకునే అవకాశం కల్పించడం తదితర ప్రయత్నాలు మనం ఈ తరుణంలో నిష్ఠగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తేనెల తేటల మాటలతో మన తెలుగు వెభవాన్ని చాటిచెపుతూ విశ్వవ్యాప్తంగా మానవీయ విలువలను, శాంతిని కాపాడే ప్రయత్నంలో సాహితి కి తమ చేయుతను, ఆదరణను అందించగలరు. తమ ఆదరణే సాహితి కి ఊపిరి, ప్రాణం కూడాను. తెలుగు రచనలే కాకుండా వివిధ భాషలలో తెలుగు సాహిత్యానువాదాలకు, తెలుగు వైభవ సుగంధాలను వెదజల్లేందుకు మరే ఇతర భాషలోనైనా రచనలకు సాహితి స్వాగతం పలుకుతోంది.
సాహితికి రచనలు ఎలా పంపాలి ?
సాహితి కి ఇదివరకు ప్రచురితం కాని మౌళిక రచనలు ఈ-మెయిల్ ద్వారా పంపగలరు. సాహితి లో ప్రచురితమైన తర్వాత మరే పత్రికకైనా నిరభ్యంతరంగా పంపవచ్చును, కానీ సాహితి వెబ్ పత్రిక లో ప్రచురితమైనట్టు సూచించగలరు. ఇదివరకే ముద్రిత పత్రికలలో ప్రచురితమైన మంచి రచనలను కూడా సాహితిలో ప్రచురణార్థం పంపవచ్చును. ఈ అక్షర యజ్ఞం పూర్తిగా వ్యాపారరహితమైనది, అందువలన తమ రచనలకు గాను సాహితి నుండి తమకు ఎటువంటి పారితోషకము అందించలేమని మనవి. తమ రచనలను గౌతమి (యూనికోడ్)ఫాంట్ ను ఉపయోగించి కంప్యూటరునందు టైపుచేసి
saahitee@gmail.com
కు ఈ-మెయిల్ ద్వారా పంపగలరు. మరేయితర ఫాంటునుపయోగించి టైపుచేసిన రచనలైనా పంపదలచినా ఫాంటునుకూడా మెయిల్ ద్వారా పంపగలరు. కంప్యూటర్ నందు తెలుగులో టైపుచేయటంలో ఏదైనా ఇబ్బంది కలిగితే తమ సందేహాలను తీర్చేందుకు, తమకు అవసరమైన సహాయాన్నందించేందుకు సాహితి ఎల్లవేలలా సంసిద్ధంగా ఉంటుంది. ఈ వెబ్ పత్రిక లో పొందుపరచిన ఉపకరణాన్ని ఉపయోగించికూడా మీరు సులభంగా తెలుగులో టైపు చేయవచ్చును. మరేవైనా సందేహాలకు సంపాదకులను దూరవాణి ద్వారా కూడా సంప్రదించవచ్చును.
సదా తమ ఆత్నీయతను కాంక్షించే
సాహితి అక్షరార్చకులు
శ్రీవైష్ణవి విజయ్ రాధిక బాబు మరియు బంధుమిత్రగణం

Thursday, July 17, 2008

Saahitee Welcomes You

saahitee welcomes you సాహితి మీకు స్వాగతం పలుకుతోంది साहिति आपका स्वागत करती है