Showing posts with label అంతరంగం ANTARAGAM. Show all posts
Showing posts with label అంతరంగం ANTARAGAM. Show all posts

Saturday, October 3, 2009

వరదబాధితులకు తక్షణ సహాయం – మానవీయ కర్తవ్యం

గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 2 అక్టోబర్, 2009 న వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎందరో సహాయానికి సైతం నోచుకోక వరదప్రాంతాల్లో ఇరుక్కుపోయి విలపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్, ప్రకాశం, కృష్ణా జిల్లాలు, ఉత్తర కర్ణాటక జిల్లాలు, కార్వార్ ప్రాంతాలు, మహారాష్ట్రలోని దక్షిణాది ప్రాంతాలప్రజలు ఆకస్మిక వరదలకారణంగా విపత్కరపరిస్థితులను ఎదుర్కొనుచున్నారు. తక్షణ సహాయం అందక మానవీయత మంటగలుస్తున్నది. ప్రాంతీయ భాషామీడియా పూర్తి ప్రాంతీయచైతన్యంతో మాత్రమే ముందుకు కదులుతున్నందున్నట్టనిపిస్తోంది. జాతీయస్థాయి ఛానెల్స్ ఈ విపత్తును విస్మరిస్తుండటం మరీ విడ్డూరం. ఈ అత్యవసర పరిస్థితిలో అవసరమైన వీరికి అవసరమైన సహాయం కోసం కేవలం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైనే ఆధారపడి వీక్షిస్తూ ఉంటే వరద పీడితులందరూ మరింత దారుణ కష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితి రావచ్చు. నిర్ణయాధికారుల ఉదాసీనతతో ఇంతటి తీవ్రదారుణ పరిస్థితులేర్పడ్డాయని మీడియా ఘోషిస్తోంది. ఈ తరుణంలో సహాయపడే హృదయంగలవారంతా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమచేతనైన సహాయంతో వరదబాధితులను ఆదుకోవాలి. ఇందుకు కేవలం డబ్బు మాత్రమే సహాయం చేయగలిగితే తక్షణం ఒనగూరే ప్రయోజనం అంతగా ఉండదు. పడవలు, ఇతర వాహనాలున్న వారు వరదప్రాంతాల్లో సహాయంకోసం అర్థిస్తున్నవారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు, వరదబాధలేని పరిసర ప్రాంతాలవాసులు వరదబాధితులకు వెంటనే అవసరమైన తిండి, నీరు, దుస్తులు, దుప్పట్లు మొదలైన వాటితో ఆపన్నహృదయులై వెంటనే ఆదుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఆలస్యం అమృతం విషం అన్నస్థితిని బాధితులు ఎదుర్కోవలసి వస్తుంది. మనం చేసే తక్షణ సహాయమే బాధితులకు అమృతం. వరదపీడిత ప్రాంతాల ఇరుగుపొరుగు గ్రామ, పట్టణ, జిల్లాలవాసులు తక్షణమే స్పందిస్తే మానవత్వం మన్నగలుగుతుంది. పీడితులు ఆత్మస్థైర్యం కోల్పోకమునుపే మన చేయగలిగిన తప్పకుండా చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం కూడా కేవలం సంబంధిత విభాగాల వారు మాత్రమే సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటే లక్షలాది బాధితులకు తక్షణ సహాయం అందక పోవచ్చు. పరిసర ప్రాంతాల అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులను సహాయక కార్యక్రమాలలో వినియోగించేందకు ఉన్నతాధికారులు అవసరమైన అనుమతిని ప్రేరణను ఇవ్వాలి. వ్యాపారస్థులు, ఉద్యోగులు కూడా ఆపన్నహృదయులై తక్షణ సహాయంకోసం స్పందించి మానవీతను కాపాడగలరని సాహితి ఆశిస్తూ అర్థిస్తున్నది.

Friday, March 27, 2009

విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు




ఉగాది
తెలుగు జనావళి స్వాగతిస్తున్న
విరోధి నామ ఉగాది
సర్వజనుల జీవితాలను సుఖాల పొదరిల్లులా మార్చి
విరోధపు విషఛాయలను దూరం చేసి
వసంతపు ఆనందాలను అందించాలని ఆకాంక్షిస్తూ....
విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


Wednesday, January 14, 2009

సంక్రాంతి శుభాకాంక్షలు

చిత్రకారుడు - మాస్టర్ విజయేంద్ర బాబు
సాహితి పాఠకులకు, రచయితలకు సంక్రాంతి శుభాకాంక్షలు

Friday, October 31, 2008

కవిత kavita

అ మ ర జీ వి – స మ ర గా థ



- డా. యస్. బషీర్, చెన్నై




భారత స్వాతంత్ర్య చరిత్రలో గాంధీజీకి ఎంతటి ప్రాముఖ్యతున్నదో ఆంధ్ర రాష్ట్ర చరితలో. . . . . అమరజీవికి ఆంతటి పేరున్నది. “తెలుగు గాంధీ” గా ఖ్యాతిగాంచిన పొట్టి శ్రీరాముల పవిత్ర బలిదానం, అజరామరం! ఓ అమరకావ్యం! అనితర సాధ్యం! ఓ మహోదయం! నవోదయం! ఓ మహా సంగ్రామం!


అమరజీవి – సమర గాథ




భారత స్వాతంత్ర్య చరిత్రలో
గాంధీజీకి ఎంతటి ప్రాముఖ్యతున్నదో
ఆంధ్ర రాష్ట్ర చరితలో. . . . .
అమరజీవికి ఆంతటి పేరున్నది.
“తెలుగు గాంధీ” గా ఖ్యాతిగాంచిన
పొట్టి శ్రీరాముల పవిత్ర బలిదానం,
అజరామరం! ఓ అమరకావ్యం!
అనితర సాధ్యం! ఓ మహోదయం!
నవోదయం! ఓ మహా సంగ్రామం!
నేడు ఆంధ్ర రాష్ట్ర 53వ అవతరణ దినోత్సవం!
అమరజీవి నామస్మరణం,
సమరజీవి పవిత్రాత్మకు నివాళులర్పించడం,
ప్రతి తెలుగువాడి కర్తవ్యం !

అమరజీవి ఆశయాలను
తెలుగు జాతి, భాషా సంస్కృతులను
సత్యం, అహింసా, ధర్మాచరణాలను,
పరిరక్షించు కోవటం మన ధర్మం.
పొట్టివాడైనను గట్టివాడుగా
విలువైన ప్రాణాన్ని తృణప్రాయంగా యెంచి
లక్ష్యసాధనే ధ్యేయంగా పురోగమించిన
అమరజీవి ఆత్మ బలిదానం
విశ్వ స్వాతంత్ర్య చరిత్రలో
కనీ, వినీ, ఎరుగని సాహస ఘట్టం
తెలుగువారందరి మేలుకోరిన ఓ మహాయాగం!
తెలుగు జాతికి గౌరవం, గుర్తింపు కలిగించిన
పొట్టి శ్రీరాముల జీవిత చరిత్ర
ఇతిహాస పుటల్లో స్వర్ణాక్షరమయం
తెలుగుజాతి హృదయాల్లో శ్రద్ధాసుమాల ప్రళయం.
“పొట్టి శ్రీరాముల వంటి పదిమంది శిష్యులుంటే
సంవత్సర కాలంలో స్వరాజ్యం సంపాదించ గలనని” గాంధీజీకు ధీమా
కలిగించిన ధన్య జీవి! త్యాగ జీవి! కర్మయోగి!
భగీరధుడు, గంగను భువికి దించినట్లు
ఆంధ్ర రాష్ట్రమును సాధించిన ఘనుడు అమరజీవి.
నిజమైన దూరదర్శి! కార్యశీలి!

58 రోజులు నిరాహార దీక్షచేసి
అమరజీవి ఆత్మార్పణం
తెలుగు వారికయ్యింది వరప్రసాదం
ఓ త్యాగ శీలి . . .
నీ కలలను తెలుగువారు
చెయ్యాలి సఫలం! అదే పవిత్రాత్మకు బలం.
అమరజీవి దివ్య దృష్టి! పారదర్శకత,
లక్ష్యసిద్ధి, సంకల్పం, ఉద్యమస్పూర్తి,
తెలుగువారిని మేలుకొలిపి
ప్రసాదించె, నవచైతన్య స్ఫూర్తి!
ఓ అమరజీవి! నీకు జోహార్లు
ఓ సమరజీవి! నీకు శతకోటి వందనాలు
అభినందన చందనాలు.





*** *** ***





అంతరంగం ANTARAGAM









తెలుగుకు ప్రాచీన భాష హోదా
నవ్వడానికా? ఏడ్వటానికా?
(త్వరలో అంతరంగం లో చదవగలరు)

Friday, August 1, 2008

అంతరంగం


దేశ భాషలందు తెలుగు లెస్స యన్న అలనాటి శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి వాక్కును నేడు కూడా దేశ వెబ్ భాషలందు తెలుగు లెస్సయని నిరూపించిన తెలుగువీరులందరికీ కృతజ్ఞతాభివందనములతో సాహితి అక్షరయజ్ఞానికి నేడు శ్రీకారం చుడుతోంది. ప్రతి తెలుగు వీరుడు వెబ్ విశ్వంలో తెలుగువ్యాప్తికి తనవంతు అక్షరయజ్ఞానికి నడుంబిగించాలని ఆహ్వానం పలుకుతోంది సాహితి.
నేడు ఆధునిక విజ్ఞాన వికాసంతోపాటు భాషల మధ్య సాంకేతిక అంతరాలు పెరిగిపోతున్నాయి. అంతర్జాలానికి అనువైన భాషగా మొదటినుండే రూపొందిన ఆంగ్లం అన్నిభాషలూ ఎదగనంత ఉన్నతస్ధాయికి ఎదిగిపోయింది. మన భాషలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చకపోయినా కంప్యూటర్లను ఆదరించి మనం సైతం ఆంగ్లంలోనే పనిచేస్తూ ఉండటం వల్లనే ఈ అంతరాలు మరింత పెరిగిపోయాయి. యూనికోడ్ ఆవిష్కారంతో వెబ్ విశ్వంలో భారతీయ భాషల వికాసానికి, మన భాషలమధ్య సాంకేతిక అంతరాలను నిర్మూలించడానికి మార్గం సుగమమైంది. మనం తెలుగును వెబ్ విశ్వంలో దిగంతాలవరకూ వ్యాపింపజేసేందుకు అనువైన సమయం ఆసన్నమైనప్పటికీ తెలుగుపత్రికలు, ఇతర ప్రచారమాధ్యమాల వెబ్ సైట్లలో యూనికోడ్ ను ఉపయోగించకపోవటంవల్ల మనం తెలుగు వ్యాప్తికి తీరని అన్యాయం చేస్తున్నామన్నది అక్షర సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకొని యూనికోడ్ ని ఉపయోగిస్తూ సుసమృద్ధమైన తెలుగు భాషా సంపదనూ, వాజ్ఞ్మయాన్నీ విశ్వవ్యాప్తంచేయటానికి మనం తక్షణం ముందడుగు వేయాలి. వీకీపీడియాలో ఎందరో నిస్వార్థ తెలుగువీరులు తెలుగు కీర్తిపతాకం ఎగురవేయటానికి నిరంతరం శ్రమిస్తుండటంచేత దేశభాషలందు తెలుగులెస్సయన్న వాక్కు వీకీపీడియాలోనూ నిరూపితమైంది. ఇంతటితో తెలుగు వెబ్ విశ్వంలో వికసించిందని సంతృప్తిచెందటం పొరపాటే. అన్నింటా మనం ముందున్నామనే సంతోషం మనకు మిగలాలంటే వెబ్ విశ్వంలో తెలుగుభాషకు తిరుగులేని వేదికగా యూనికోడ్ ను మనమందరం ఆదరించి ప్రయోగించవలసిన సమయమిదే. కంప్యూటర్ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి అందరి సహకారంతో వెబ్ విశ్వంలో తెలుగు చైతన్యదీప్తిని ప్రసరింపజేయటానికీ, వెబ్ విశ్వంలో తెలుగు భాషా సాహిత్యాలవికాసంతో పాటు మానవతా విలువలను కాపాడటంలోనూ తనవంతు సహాయం ఉడుతాభక్తితో నెరవేర్చే సంకల్పంతో సాహితి ఈరూపంలో మీ ముందుకు వచ్చింది.
మంచి తెలుగు సాహిత్యాన్ని డిజిటలైజ్ చేస్తూ, తెలుగువెలుగులూ, మానవతావిలువలూ దిగంతాలకు ప్రసరింపజేసే ప్రయత్నంలో సాహితికి తమరి ఆదరాభిమానాలే కొండంత అండ. వెబ్ విశ్వంలో ఈ అక్షర యజ్ఞానికి మీరు సైతం నడుం బిగించాలని సాహితి ఆహ్వానం పలుకుతోంది. తేనెలొలుకు తెలుగుభాషా మాధుర్యాన్ని అందరికీ పంచేందుకు తమరు చేసే ప్రతి ప్రయత్నానికి సాహితి తనవంతు చేయూతను తప్పక అందిస్తుంది.

కొన్ని రచనలతో నేడు ప్రారంభమైన సాహితి నిరంతరం కొత్త రచనలతో మీకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. మీరు ఏ రచన విషయంలో నైనా ఆ రచన చివరన ఉన్న comments పై క్లిక్ చేసి అక్కడే తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వ్యక్తపరచవచ్చును. నిత్యమూ సాహితి సందర్శిస్తూ తమ అమూల్యమైన అభిప్రాయాలను అందించవలసినదిగా కోరుతూ...
అక్షర అభివందనాలతో...


శ్రీవైష్ణవి విజయ్ రాధిక జయ శంకర బాబు