Friday, August 1, 2008

అంతరంగం


దేశ భాషలందు తెలుగు లెస్స యన్న అలనాటి శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి వాక్కును నేడు కూడా దేశ వెబ్ భాషలందు తెలుగు లెస్సయని నిరూపించిన తెలుగువీరులందరికీ కృతజ్ఞతాభివందనములతో సాహితి అక్షరయజ్ఞానికి నేడు శ్రీకారం చుడుతోంది. ప్రతి తెలుగు వీరుడు వెబ్ విశ్వంలో తెలుగువ్యాప్తికి తనవంతు అక్షరయజ్ఞానికి నడుంబిగించాలని ఆహ్వానం పలుకుతోంది సాహితి.
నేడు ఆధునిక విజ్ఞాన వికాసంతోపాటు భాషల మధ్య సాంకేతిక అంతరాలు పెరిగిపోతున్నాయి. అంతర్జాలానికి అనువైన భాషగా మొదటినుండే రూపొందిన ఆంగ్లం అన్నిభాషలూ ఎదగనంత ఉన్నతస్ధాయికి ఎదిగిపోయింది. మన భాషలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చకపోయినా కంప్యూటర్లను ఆదరించి మనం సైతం ఆంగ్లంలోనే పనిచేస్తూ ఉండటం వల్లనే ఈ అంతరాలు మరింత పెరిగిపోయాయి. యూనికోడ్ ఆవిష్కారంతో వెబ్ విశ్వంలో భారతీయ భాషల వికాసానికి, మన భాషలమధ్య సాంకేతిక అంతరాలను నిర్మూలించడానికి మార్గం సుగమమైంది. మనం తెలుగును వెబ్ విశ్వంలో దిగంతాలవరకూ వ్యాపింపజేసేందుకు అనువైన సమయం ఆసన్నమైనప్పటికీ తెలుగుపత్రికలు, ఇతర ప్రచారమాధ్యమాల వెబ్ సైట్లలో యూనికోడ్ ను ఉపయోగించకపోవటంవల్ల మనం తెలుగు వ్యాప్తికి తీరని అన్యాయం చేస్తున్నామన్నది అక్షర సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకొని యూనికోడ్ ని ఉపయోగిస్తూ సుసమృద్ధమైన తెలుగు భాషా సంపదనూ, వాజ్ఞ్మయాన్నీ విశ్వవ్యాప్తంచేయటానికి మనం తక్షణం ముందడుగు వేయాలి. వీకీపీడియాలో ఎందరో నిస్వార్థ తెలుగువీరులు తెలుగు కీర్తిపతాకం ఎగురవేయటానికి నిరంతరం శ్రమిస్తుండటంచేత దేశభాషలందు తెలుగులెస్సయన్న వాక్కు వీకీపీడియాలోనూ నిరూపితమైంది. ఇంతటితో తెలుగు వెబ్ విశ్వంలో వికసించిందని సంతృప్తిచెందటం పొరపాటే. అన్నింటా మనం ముందున్నామనే సంతోషం మనకు మిగలాలంటే వెబ్ విశ్వంలో తెలుగుభాషకు తిరుగులేని వేదికగా యూనికోడ్ ను మనమందరం ఆదరించి ప్రయోగించవలసిన సమయమిదే. కంప్యూటర్ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి అందరి సహకారంతో వెబ్ విశ్వంలో తెలుగు చైతన్యదీప్తిని ప్రసరింపజేయటానికీ, వెబ్ విశ్వంలో తెలుగు భాషా సాహిత్యాలవికాసంతో పాటు మానవతా విలువలను కాపాడటంలోనూ తనవంతు సహాయం ఉడుతాభక్తితో నెరవేర్చే సంకల్పంతో సాహితి ఈరూపంలో మీ ముందుకు వచ్చింది.
మంచి తెలుగు సాహిత్యాన్ని డిజిటలైజ్ చేస్తూ, తెలుగువెలుగులూ, మానవతావిలువలూ దిగంతాలకు ప్రసరింపజేసే ప్రయత్నంలో సాహితికి తమరి ఆదరాభిమానాలే కొండంత అండ. వెబ్ విశ్వంలో ఈ అక్షర యజ్ఞానికి మీరు సైతం నడుం బిగించాలని సాహితి ఆహ్వానం పలుకుతోంది. తేనెలొలుకు తెలుగుభాషా మాధుర్యాన్ని అందరికీ పంచేందుకు తమరు చేసే ప్రతి ప్రయత్నానికి సాహితి తనవంతు చేయూతను తప్పక అందిస్తుంది.

కొన్ని రచనలతో నేడు ప్రారంభమైన సాహితి నిరంతరం కొత్త రచనలతో మీకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. మీరు ఏ రచన విషయంలో నైనా ఆ రచన చివరన ఉన్న comments పై క్లిక్ చేసి అక్కడే తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వ్యక్తపరచవచ్చును. నిత్యమూ సాహితి సందర్శిస్తూ తమ అమూల్యమైన అభిప్రాయాలను అందించవలసినదిగా కోరుతూ...
అక్షర అభివందనాలతో...


శ్రీవైష్ణవి విజయ్ రాధిక జయ శంకర బాబు

No comments: