Friday, August 1, 2008

పత్రికా సమీక్ష


తెలుగు వారి సమైక్యతే లక్ష్యంగా పురోగమిస్తున్న
నడుస్తున్న చరిత్ర


- డా. సి. జయ శంకర బాబు


తెలుగు భాషా సంస్కృతుల ప్రచారమే ధ్యేయంగా తెలుగు వారి సమైక్యతే లక్ష్యంగా పురోగమిస్తున్న నడుస్తున్న చరిత్ర గత 16 సంవత్సరాలుగా విజయవాడ నుండి నిరంతరాయంగా వెలువడుచున్నది. వివిధ ప్రాంతాలలో, వృత్తులలో, జనజీవనంలో ఉన్న పదాలవాడుక పెంచుతూ, ఇతర భాషాపదాలను అనవసరంగా ఉపయోగించకుండా తెలుగును ఉమ్మడి ప్రామాణిక భాషగా రూపొందించుకుందామన్నది ఈ పత్రిక ప్రచురణకర్తల వాక్కు. అవసరమైతే మనభాషలోనే కొత్త పదాలను తయారుచేయండనే సందేశాన్ని ఈ పత్రిక అందిస్తోంది. ఈ సందేశంలో వ్యావహారికత గురించి మనమాలోచిస్తే మనకు లభించే నిష్కర్షేమిటంటే కొత్త పదాలెన్ని తయారుచేసినా వాటి వాడుక చాలా ముఖ్యం. తెలుగు దిన పత్రికలలో, సినిమాలలో, బుల్లితెర కార్యక్రమాల్లో అటువంటి పదాలను నిరంతరం ఉపయోగిస్తే అవి జనజీవన స్రవంతిలో కలిసిపోగలవు. అన్ని తెలుగు ప్రచారమాధ్యమాలలో ఇలాంటి చైతన్యాన్ని నింపేదిశగా నడుస్తున్న చరిత్రతో పాటు మనమూ పురోగమిస్తే తెలుగుతేజాన్ని నలుదిశలా వ్యాపింపజేయటం సాధ్యమే.
విభిన్న ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు ప్రజల సమైక్యతనూ, తెలుగుభాష ఔన్నత్యాన్నీకాంక్షిస్తూ నడుస్తున్న చరిత్రలో సంపాదకులు సోమల రమేష్ బాబు గారు రాస్తున్న సంపాదకీయాలు భాషాచైతన్యాన్ని పెంపొందించుకోవాలన్న తపన గల ప్రతి తెలుగు వాడి నాడికి సరికొత్త స్పందననందిస్తాయనటంలో అతిశయోక్తి లేదు. ఉద్యమచైతన్యంతో ముందుకు సాగుతూ తెలుగుజాతి వేదికగా రూపందుకున్న ఈ పత్రికలో తెలుగు భాషా, సంస్కృతులపై వ్యాసాలు, పరిశోధనా ఫలితాలే కాకుండా తెలుగువారికి సంబంధించిన వర్తమాన సంఘటనలు, సాహితీరంగవార్తలు, కథ, కవితలు పత్రిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇటీవలే వెలువడిన జూలై 2008 సంచికలో సంపాదకహృదయం ‘తెలుగుజాతి కోసం పోరాడే రాజకీయం కావాలి’ అన్నశీర్షికతో రాసిన సంపాదకీయంలో ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశ సంఖ్య 76/10-6-2008 పట్ల ఆవేదన, వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమౌతోంది. ‘తెలుగు భాషా పదసంపదను కాపాడుకోవడానికి ఏంచేద్దాం?!’ అంటూ చూపు శీర్షికలో జయధీర్ తిరుమలరావుగారి పరిశోధనాత్మక వ్యాసం, తెలుగు సిరి శీర్షికన ‘తెలుగు క్లాసికల్ భాష కాదా?’ అంటూ ప్రశ్నిస్తూ ఆచార్య ఆర్వీయస్ సుందరంగారు తమ వ్యాసంలో గిడుగు సీతాపతిగారు కేంద్రసాహిత్య అకాడమీకి వ్రాసిన సాహిత్యచరిత్రలో ఉన్న అబద్దాలే తమిళులకు పనికివచ్చాయని ఉద్ఘాటించారు. వాస్తవానికి మనం ఇటువంటి అబద్దాల పుట్టలు పెరుగుతున్న సందర్భాలలో వెంటనే స్పందించకపోవటంవల్లనే ఇటువంటి గ్రంథాలు ప్రామాణిక గ్రంథలైపోతున్నాయేమోననిపిస్తుంది. చరిత్రకు సంబంధించిన విషయంలో ఏ గ్రంథమైనా ప్రామాణికతను పొందుతోందంటే అందులో ఉన్న నిజాలైనా, అబద్దాలైనా మనం మౌనంగా అంగీకరించబట్టే. ఇప్పటికైనా మించిపోయిందిలేదు. సుందరం మేష్టారుగారిలాంటి వారు తమకలాల్ని ఝళిపిస్తే తెలుగుకు ఎంతోకొంత మేలు చేకూరుతుంది, సత్యమేవ జయతేకూ సార్థకత సిద్ధిస్తుంది. వ్యాఖ్యానం, తెలుగుతనం, స్వాభిమానం, పరిశోధన, న్యాయపీఠం, జ్ఞాపకాలదొంతర, అన్వేషణ మొదలైన ఆకర్షణీయమైన శీర్షికలలో రచయితలు ఆసక్తికరమైన విషయాలపై తమ భావాలను వ్యక్త పరిచారు. పరామర్శ ప్రణామం శీర్షికన పుస్తక సమీక్ష, గ్రంథాలయం శీర్షికన గ్రంథస్వీకారం సచిత్రంగా ప్రచురించారు. స్పందన శీర్షికలో గత సంచికలలోని రచనలపై పాఠక స్పందనకు స్థానందక్కింది. తెలుగువాణి సారథ్యంలో తెలుగుసంఘాల సమైక్యతలో 5, 6 జూలై 2008 న తిరుచ్చిలో ఘనంగా జరిగిన దక్షిణ భారత తెలుగు పల్లెకళల పండుగకు సంబంధించిన సచిత్రవార్తలతోపాటు పూజకుణిత కళారూపం ముఖచిత్రంగా వెలువడిన ఈసంచిక అవశ్యం పఠనీయం. నడుస్తున్న చరిత్ర ప్రతి సంచికలోనూ తెలుగు నవచైతన్యదీప్తి గోచరిస్తోంది. నేటి సాంకేతిక యుగంలో తెలుగుభాష ఔన్నత్యానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ వెబ్ విశ్వంలో విస్తరిస్తున్న తెలుగు ఆనవాళ్ళగురించికూడా ఈపత్రికలో స్థానం కల్పిస్తే పత్రిక భాషాఉద్యమస్ఫూర్తికి సంపూర్ణత చేకూరుతుంది. రాబోయే సంచికలలో ఈ దిశగా ప్రయత్నించగలరని సాహితి ఆశిస్తోంది.

No comments: