Friday, August 15, 2008

వెబ్ లోకం

వెబ్ లోకం


వెబ్ విశ్వంలో తెలుగు ఏ స్థానంలో ఉందో ఆలోచించి తెలుగు వ్యాప్తికై నేను సైతం కృషిచేయగలనని సంకల్పించే తెలుగువీరుల చైతన్యం కోసమే ‘వెబ్ లోకం’ శీర్షిక. సాహితి పాఠకులలో వెబ్ పరిజ్ఞానాన్ని వికసింపజేయటానికి ఉద్దేశించిన ఈ శీర్షిక లో ధారావాహికంగా ప్రచురితమయ్యే వ్యాసాల పరంపరలో మొదటి వ్యాసం ‘వెబ్ లో తెలుగు’ చదవగలరు.

వెబ్ లో తెలుగు

- డా. సి. జయ శంకర బాబు

వెబ్ విశ్వంలో తెలుగు స్థానం గురించి కొన్ని వివరాలు తెలుసుకొని, ఆపై తెలుగు అభిమానుల తక్షణ కర్తవ్యం గురించి ఆలోచిద్దాం.

కంప్యూటర్లు పుట్టిన నాటినుండి వాటి సాంకేతిక పరిజ్ఞానానికి అనువైన భాషగా ఆంగ్లం వర్ధిల్లుతోంది. ఇది మనందరికీ సంతోషకరమైన విషయమే. ఆంగ్లేయులపాలనలో మనకబ్బిన ఆంగ్లభాషా పరిజ్ఞానం మనల్ని కంప్యూటర్ రంగంలోనూ రాణిస్తున్నదేశాల్లో ఒక ప్రముఖ దేశంగా భారతదేశాన్ని నిలిపేందుకు తోడ్పడింది. ఈ పరిజ్ఞానాన్ని మన భాషలకు కూడా అందజేసి మన సంస్కృతి సౌరభాలను విశ్వవ్యాప్తం చేసేందుకు, వెబ్ విశ్వంలోనూ మన భాషల ఆనవాల్లు శాశ్వతంగా ఉండేలా ప్రయత్నించటం మన కర్తవ్యం. అత్యంత అభివృద్ధి చెందిన జపాన్, చైనాలాంటి దేశాలకంటే ముందు మనదేశంలో కంప్యూటర్ వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టగలిగాము. మనకంటే ఆలస్యంగా తమ దేశంలో కంప్యూటర్లకు స్థానం కల్పించిన చైనా ఆదర్శాన్ని గురించి కూడా మనం ఈ క్షణంలో స్మరించటం ముదావహం. చైనీయులు తమ భాషకు స్థానంలేని కంప్యూటర్లకు తమదేశంలో స్థానంలేదంటూ ప్రతినబూని మరీ సాధించారు. మనం ఆంగ్లంలోనే సరిపుచ్చుకున్నా నేడు వెబ్ విశ్వంలో మన భాషల స్థితిగతులేమిటో ఆలోచిస్తే మనకు ఆవేదన కలుగక మానదు.

భారతీయ భాషలకు వెబ్ విశ్వంలో స్థానం దక్కిందని మనం సంతోషంచినా, మనమంతా సమైక్యంగా ముందుకు కదలటంలేదనే సత్యాన్ని గుర్తించవలసి ఉంది. అదెలా అంటే నిన్నటివరకూ మనభాషలకుపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వలన మనం వెబ్ విశ్వంలో విస్తరిస్తున్నామని సంతోషించినా, మనమందరం ఉపయోగిస్తున్నది మాత్రం ఉమ్మడి పరిజ్ఞానం కాదన్నది నిజం. ఉదాహరణకు తెలుగు పత్రికలు, ఇతర మాధ్యమాల వెబ్ సైట్లలో యూనికోడ్ ను ఏ కొందరో ఉపయోగిస్తున్నారు. వారు ఉపయోగిస్తున్న ఇతర కోడ్ కలిగిన ఫాంట్ లో ఉన్న కొంత సామగ్రిని సర్చ్ ఇంజన్లు వెదుకుతున్నప్పటికీ వీటి వల్ల మన తెలుగు లభించివలసిన ఉమ్మడి ప్రయోజనం మాత్రం అందటం లేదు. పరివర్తనీయత, పఠనీయత వంటి సమస్యలు తలెత్తున్నాయి. ఒక్కో వెబ్ సైట్ కు ఒక ఫాంట్ ను ఉపయోగిస్తుంటే అన్ని ఫాంట్లను మన కంప్యూటర్ లలో డౌన్ లోడ్ చేసుకోవటం కూడా అంత వ్యావహారికం కూడా కాదు. ఫాంటు లేకుండా ఈ-మెయిల్, చాటింగ్ వగైరా కూడా సాధ్యపడదు. ఇలాంటి మరెన్నో కారణాలు, అసౌకర్యాలున్నప్పటికీ యూనికోడ్ వైపెందుకో మన వారి శీతకన్ను. మన తెలుగు పత్రికల వారిని కూడా ఈ దిశలో ముందడగు వేయమని మనమంతా కోరవలసిన బాధ్యాతా ఉంది.

మన తెలుకు సాహితీ సంపద వెబ్ విశ్వంలో వెలుగొందాలంటే మనమందరం తప్పకుండా యూనికోడ్ ను ఉపయోగించాలి. వెబ్ విశ్వంలో మన తెలుగు ఏ మాత్రం వెనుక పడకూడదన్న చైతన్యం కలిగిన అసంఖ్య తెలుగు వీరులు తమ బ్లాగులద్వారా, ఎందరో వీకీపీడియన్లు జ్ఞానయజ్ఞంలోనూ స్వచ్ఛందంగా దివారాత్రాలు శ్రమిస్తుండం వలన నేడు కూడా మనం సగర్వంగా వెబ్ భాషలందునూ తెలుగు లెస్స యని చాటగలుగుతున్నాము. ఈ విషయం మరెందరిలోనో చైతన్యం నింపేదిశగా కూడా మనం ఇప్పుడే కదలాలి. సాహితి అండతో ‘వెబ్ లోకం’ కూడా అదే ప్రయత్నంలో ఉంది.

‘వెబ్ లోకం’ శీర్షికన ప్రచురితమయ్యే తదుపరి వ్యాసం – ‘తెలుగుకు యూనికోడ్ ను ఎలా ఉపయోగించాలి?’ తప్పక చదవగలరు.

(వెబ్ లోకం web lokam by Dr. C. Jaya Sankar Babu)

No comments: