‘పునరపి’
(కవితా సంపుటి)
ఉప్పలధడియం వెంకటేశ్వర కావ్య ప్రతిభ అభినందనీయం
- సి. జయ శంకర బాబు
“సమకాలిక జీవితమే సత్కవితా వస్తువు” అని,
“రుచీ, ఔచిత్యం, ఇవీ ముఖ్యం మెప్పుకి,
కవి కోరే మెప్పు గండపెండేరం కాదు
సమాన ధర్ముల హృదయస్పందనం శిరఃకంపనం
అదీ గీటురాయి అసలైన కవిత్వానికి
వానలాగ ప్రజల హృదయాల్లో వర్షించి
కొత్త భావాల బీజాలు చల్లేది కవిత్వం
ప్రజలు చప్పట్లు కొట్టే భావాలకీ
పద్యాల రూపం ఇస్తే చాలదు
ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తూనే కవి
మెజారిటీకి అందని ఊహలు వెదకాలి
ఆ తర్వాత అతని మైనారిటీ ఓటు
ఆక్రమిస్తుంది ప్రజాహృదయంలో చోటు
ఏమైనా సరే కవిత్వం
మేలుకొల్పాలి కాని జోకొట్టగూడదు”
అని కూడా విశదీకరించిందెవరో కాదు ... తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి రక్షించిన మహాకవి శ్రీశ్రీ.1 ఆ మహానుభావుని జన్మదినమైన నేడు (30 ఏప్రెల్) ఆయన కవిత్వానికి ఇచ్చిన నిర్వచనాల అడుగు జాడల్లో పురోగమిస్తున్న యువకవి ఉప్పలధడియం వెంకటేశ్వర విరచించిన – ‘ప్రకంపనం’, ‘వెంకటేశ శతకం’, ‘మృత్యు ద్వీపం’ కవితా సంపుటాల తరువాత మరో సంపుటం ‘పునరపి’ శీర్షికన నేడు ఆవిష్కరణ కావటం మనందరికీ సంతోషదాయకం. ఈ కృతిని సమీక్షించే బాధ్యతను నాకు అప్పగించినపుడు నాలో ఒకవైపు సంతోషం మరో వైపు అనుమానం ఒకేసారి పుట్టుకొచ్చాయి. అనుక్షణం సాహితీ ప్రేమలో నిమజ్ఞమై ఉండే నాకు ఇటువంటి అవకాశం కలగటం సహజంగా సంతోషకరమే. మరి అనుమానమేమిటంటే ఒక తెలుగు రచనను తెలుగులో సమీక్షించటం – ఎప్పుడూ హిందీలోనే రాస్తూ, హిందీలోనే బోధిస్తూ ఉన్న నాకు చేతనయ్యే పనేనా అని అనుమానం పీడిస్తున్నా అభిమానం ధైర్యాన్నిచ్చింది, సంతోషం ప్రేరేపించింది, ఈ ప్రేరణతోనే వెంకటేశ్వరగారి తెలుగు కవితా సంపుటి ‘పునరపి’ ని సమీక్షించే సాహసం చేస్తున్నాను. నేను, నాకు దక్కిన ఈ సమీక్ష బాధ్యతను నిర్వర్తించడంలో సఫలీకృతుడనయ్యానో లేదో ఆ నిర్ణయాన్ని మీకు వదిలేస్తూ ‘పునరపి’ ని పరిచయం చేస్తున్నాను.
“నవత్వం ప్లస్ మానవత్వం ఈజ్ ఈక్వల్స్ టు కవిత్వం” అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఆ మహానుభావుని మాటలకనుగుణంగానే విరంచించారు వెంకటేశ్వర గారు ‘పునరపి’ని. నిజమే మానవతావిలువలు లేని మాటలు కవిత్వం కాజాలవు. ఈ కవితా సంపుటిలో నవత్వానికీ, మానవత్వానికీ తగినంత చోటును కల్పించారు కవిమిత్రులు ఉప్పలధడియం వెంకటేశ్వర.
“మంత్రదండం చేపట్టి
వడలిన శబ్దలతకు
వసంతోత్సవం జరుపుతాను
కలం నా ఊహల కాహళగా
రోసిన మాటల్ని కొంగొత్త రోచిస్తులతో వెలిగిస్తాను
నేనెప్పుడు కొత్త భాషే మాట్లాడుతాను
మామూలు మాటల్లో పద్యం ఒదుగుతుందా
నిలువెల్లా తపించే మాటే పద్యమౌతుంది”
అని పద్యానికి అసలు సిసలైన నిర్వచనాన్ని ‘కవిభాష’ శీర్షికన రాసిన మొదటి పద్యంలో ఇంకా - “శబ్దాన్ని అనల పునీతం కావిస్తాను” అని వచించారు కవి. మొత్తం 35 కవితలున్న ఈసంపుటిలో కవి నిజంగానే ఆప్రయత్నం చేశారు కూడా. (ఈ కవితా సంపుటిలో 3 ఛందోబద్ద కవితలు, 32 వచన కవితలు – అందులో గీతాలు, హైకూలు, నానీలు, చిట్టి కవితలు మరెన్నో ఇమిడి ఉన్నాయి.)
“అంతరాంతర జ్వాలలో
నిలువునా దగ్ధమైపోతాను
ప్రతి కలుగులోకీ చొరబడతాను
అనంత మైదానాల్లో పయనిస్తాను
మళ్ళీ శరీరాన్ని కప్పుకొన్నప్పుడు
పంజరవు చిలకనై
టపటపా కొట్టుకొంటాను
ఒక జననం
ఒక మరణం
పునఃపునః జనన మరణ ప్రక్రియ
సముద్రమూ ఆకాశమూ కలవని చోట
రక్తపుష్పమై పరిమళిస్తాను”....
అంటారు కవి. ఇదే ‘పద్యావిర్భావం’.
కవి హృదయం తపించే భావాలకు నిలయం.
“వాగాతీతమైన భావంబు లెన్నియో
చెంగలించుచుండు చిత్తమందు
వాని నొడిసి పట్టబూని మిక్కిలి గాయ
పడుచునుందు నెన్ని తడవలేని
పలుకులొండె కాదు తలపులపై గూడ
ప్రభుత నెరపు తెలయరాని శక్తి
పారతంత్ర్య దుఃఖ భార మోపగ లేక
బ్రద్ధ లగుచునుండు పాడుగుండె ”
అంటూ తన కవిత్వరచనా ‘నేపథ్యా’న్ని రెండు ఆటవెలదులు, ఒక తేటగీతి, మరో రెండు కందాల్లో కలగలిపి బహుచక్కగా వర్ణించారు.
“బహిరంతర్జగముల దు
స్సహ ఘర్షణ మాన్పి తదనుసంధానముకై
అహరహమును యత్నించుచు
బహుకవితా రూపినై ప్రవర్తలెద సుమీ ! ”...
అని నుడివిన వెంకటేశ్వర గారి కావ్య ప్రతిభ అభినందనీయమైనది. వీరు ఛందంలోనూ, స్వచ్ఛందంలోనూ (అంటే వచన కవితలల్లడంలోనూ అని), స్వచ్ఛందంలోనూ (భావవ్యక్తీకరణలో స్వేచ్ఛ) ఘనాపాటి.
“మాటలకై వెదుకాడగపోతేఅవి,
పుంఖానుపుంఖంగాశ్మశానాలవంటి నిఘంటువుల దాటి,
వ్యాకరణాల సంకెళ్ళు విడిచి,
ఛందస్సుల సర్వపరిష్వంగం వదలి----
వడిగా, వడివడిగావెలువడినై, పరుగుడినై, నా యెదనడుగిడినై ! ”
అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు వెంకటేశ్వరగారి కవితల్లోనూ పదాలు పరవళ్ళే తొక్కాయి, (అందులో కవి మనోయజ్ఞంలోనుండి పుట్టిన సరికొత్త తెలుగు పదాలూ కొన్ని ఉన్నాయి – చలువ గది, తిండిబల్లల్లాంటివి)
హిందీలో స్నాతకోత్తర పట్టాను పొంది (త్వరలో డాక్టరేటు పట్టానూ పొందనున్నారు), రాజభాషగా హిందీ అమలు కొరకై కృషి చేయడమే మన కవిమిత్రులు ఉప్పలధడియం వెంకటేశ్వరగారి గారి ఉద్యోగ బాధ్యత. అయినా మాతృభాష సేవలో తరిస్తున్న ప్రయత్నం అనుకరణీయం, అభినందనీయం.
తెలుగు భాషా సంస్కృతుల ఔన్నత్యాన్ని ఆవిష్కరించే కవితలు ఇందులో ఎన్నో ఉన్నాయి. ప్రకృతి వర్ణన కోసం రాసిన కవితైనా, ‘కూనలమ్మ పదాలు’ శీర్షికన రాసిన ఆకర్షణీయమైన చిట్టి పద్యాలైనా, ‘చెన్నపురి నానీ’ల పేరిట చిగురించిన చిరు కవితలైనా అడుగడుగునా తెలుగుదనం, తెలుగుభాషాభిమానమూ, తెలుగు సంస్కృతీ తొంగిచూస్తున్నాయి. ‘అమ్మలగన్నయమ్మ’ శీర్షికన ఆ అభిమానం కట్టలు తెంచుకొని తెలుగు తల్లికి నీరాజనం పలుకుతుంది. ఆ కవితలో కవి సంధించే ప్రశ్నలకు మీరిచ్చే జవాబు కూడా తెలుగుతల్లికి నీరాజనమే అవుతుంది. కవి ప్రశ్నలు వింటారా... ?
“ప్రభువుచే పల్లకీ మోయించుకొన్న కవులున్నారా ఎక్కడైనా ?
కవి పాదాలకు గండపెండేరం తొడిగిన రాజు కనిపిస్తాడా
కాగడా పట్టుకొని వెదికినా ?
మాటలను యథాతథంగా
అనితవేగంగా అనువదించే లిపి మరొకటుందా ?
జానపదానికైనా, జటిల సమాసానికైనా
అనువుగా ఒదికే ఇంపయిన భాష ఇంకొకటుందా ?”
(అంటూ సంధించారు ప్రశ్నల్ని, మరి వీటికి మీరిచ్చే సమాధానమేమిటి ? )
(తెలుగంటే ఏమిటి ? ఎలాంటిదది ? మీరు చెప్పండి చూద్దాం !)
“ఏమబ్బుతెరా ఆవరించని సూర్యతేజం
ఏ మంటుపొరా కమ్మజాలని మేరుశైలం
సానబెట్టిన జాతి వజ్రం, పులుగడిగిన ఆణిముత్యం
ఔనౌను, జూలు విదిల్చిన సింహంరా తెలుగంటే !”
అంటూ –
“ఖండఖండాతరాల్లో అనేకానేక భాషల్లో
అల్లుకొన్న పరిమళం తెలుగు
అంధనేత్రం తెరచి చూస్తే అగుపించే విశ్వరూపం
చరిత్ర కందని ఏ యుగాల నుంచీ
నిరంతరంగా వెలుగుతోందో ఈ అఖండదీపం !”
అంటారు వెంకటేశ్వర.
‘సాగర సంగీతం’ శీర్షికన రాసిన కవితలో భాషాభిమాన భావాల్ని పరీక్షించండి !
“సాగరతీరాన
చల్లగా వీస్తొంది దక్షిణపుగాలి
తెలుగు పద్యంలా....
ఉద్యానంలో కాబోలు
భాష తెలియని బాలిక ఆలపిస్తోన్న
త్యాగయ్య కృతి
చెవి బడలిక తొలగిస్తోంది” ....
“దోపిడిని, దౌర్జన్యాన్నీ
చెండాడడాని కన్నట్టుగా
విరుచుకు పడుతున్నాయి కెరటాలు
మహాప్రస్థాన గీతాల్లా”
‘ఒకడు రాయలు’ శీర్షికన ఒక కవితలో తెలుగు జాతి చరితలో లెస్సయైన వెలుగుదివ్వెగా శ్రీకృష్ణదేవరాయలను కీర్తిస్తూ రాయల భాషా సాహితీ సేవను కొనియాడారు. రాయలనాటి వైభవ వర్ణన పర్యంతం –
“రాయలు చూపిన త్రోవయె
శ్రేయోదాయక మటంచు చెప్పిరి విబుధుల్
పాయక తన్నార్గంబున
పోయిన చాలు మన జాతి పొందును శుభముల్ ”
అంటారు మన జాతి వైభవాన్ని కాంక్షించే కవి వెంకటేశ్వర.
‘కూనలమ్మ పదాల్లో’నూ తెలుగు వైభవాన్ని కీర్తిస్తూ –
“అన్నమయ్యకు సాటి
అవనిలేడని చాటి
చెప్పవలె వాగ్ధాటి
ఓ కూనలమ్మా”
అంటూ
“భాషలార్వేరులున్న
నన్నింటిలో నెన్న
మనభాషయే మిన్న
ఓ కూనలమ్మా”
అని మాతృభాషాభిమానాన్ని ప్రేరేపించారు.
‘చెన్నపురి నానీల్లో’నూ తెలుగువారిని స్మరిస్తూ-
“సూరీ, శ్రీశ్రీ
నడయాడిన నేల ఇది
కానీ నేడది
కేవలం పురాస్మృతి ”
అంటూ మరో నానీలో
“త్యాగయ్య రాగామృతం
తాగని తరం లేదు
వినాలేగాని
చెప్తే అర్థం కాదు ”
అని కీర్తించారు
మరో నానీ ఇలా కూడా –
“తెలుగోణ్ణని
చెప్పుకోవడం నామోషీ
అన్ని భాషలొకటే
అంటూ హిపోక్రసీ. ”
***
“ఆంగ్లమ్ము పై మోజు
అధికమౌ ప్రతిరోజు
మన మెదడులో బూజు
ఓ కూనలమ్మ “
అంటూ ఆంగ్ల భాషావ్యామోహాన్ని విమర్శించారు.
ప్రకృతి సహజ వర్ణనలో ఉప్పలధడియం వెంకటేశ్వరగారిది అందెవేసిన చేయి. ‘ప్రభాత దృశ్యం’ శీర్షికన రాసిన కవితలో కవి భావాల్ని ఆస్వాదించండి –
“ఎండతాకున కందిపోయే
సుమబాలకు
సీతాకోకచిలక వింజామరలు వీస్తోంది
ప్రభాత దృశ్యం
నలుదెసలా పుప్పుడిలా
గుబాళిస్తోంది ”
జీవనోత్సవం శీర్షికన రాసిన కవితలోనూ ప్రకృతి వర్ణనతో పాటు ఉగాది వైభవ వర్ణనతో మరో సారి తెలుగు తేజాన్ని కీర్తించారు –
“తెలుగు తేజం దిగంతమ్ముల
నవ్యశోభల మెరయుచుండగ
జీవనోత్సవ కేతనమ్మై
చెంగలించు నుగాది పండగ ”
ఈసంపుటిలోని కవితల్లో నిక్షిప్తమైన మరో ప్రధాన స్వరాన్నీ ఆస్వాధించే ప్రయత్నం చేద్దాం.
“మనిషి కోసం కవిత్వం
మంచి కోరి నవత్వం ”
అన్న అభ్యుదయ కవి శ్రీశ్రీ
“మనుష్యుడే నా సంగీతం మానవుడే నా సందేశం” అని అన్నారు. ‘పునరపి’లో మానవీయ విలువలకు దక్కిన స్థానం, సామాజిక స్థితిగతులు, అట్టడుగు-పేద వర్గాల జీవన సమరం, సామాజిక సృహతో కూడిన భావాలను పరిశీలించినపుడు ఈ సంపుటిలో సగభాగం కవితలు కాస్తోకూస్తో ఈ కోవకు చెందినవిగానే అనిపించాయి.
కష్టజీవుల వెతలను కనులకు కట్టినట్లు వర్ణించడమేకాదు, శ్రమించే ప్రతిజీవీ చైతన్యంతో కదిలితేనే జీవితాంధకారాన్ని వెలుగుమయం చేయవచ్చుననేది కవి భావన.
“మన స్వేద ప్రవాహంతోనే.
ఈ నేల సస్యశ్యామల మవుతోంది
మన కండల కొండల మీదే
ప్రపంచానికి ప్రభాత మవుతోంది ”
గత చరిత్రను కీర్తిస్తూ –
“సమస్త జగత్తుకీ బీజ మంత్రం మనమే”... అంటూ “రెపరెపలాడే ఎర్రబావుటా లాంటి మూడో కన్ను తెరుద్దాం”... అని చైతన్య స్వరాన్ని ఆలపించారు ‘మూడో కన్ను’ శీర్షికన ఓ కవితలో.
“స్థలాన్నీ కాలాన్నీ సర్వస్వాన్నీ శాసించే
సర్వం సహా చక్రవర్తులం మనమే కదా !”
అంటూ స్వర్ణ యుగం వైపుకు నడిపించే ప్రయత్నంలో కవితా కిరణ వెలుగుల్ని ఎలా ప్రసరింపజేశారో కాస్త గమనిద్దాం –
“ఉషః కిరణ సంపుటి
మట్టి గుండెను తట్టిలేపుతుంది
దిగంత రేఖ మీద
స్వప్నకేతనం రెపరెపలాడుతుంది
భూమి ఆకాశాన్ని చుంబిస్తుంది
నిశాదుశ్శాసనుడి రక్తం పూసుకొని
కాలం వెలుగునవ్వులు రువ్వుతుంది
కంకణ హస్తం కికురిస్తుంది
నేత్రం జ్వలిస్తే విస్తరించే స్వప్నం స్వర్ణయుగం “
పేదరికం శాపమై జీవితాల్ని శాసిస్తున్నా మానవత్వం మంటగలవరాదు. ప్రేమ, మమత, ఆప్యాయతలవంటి సుకోమల భావాల్ని ఆచరణలో పెడితే పేదలైనా, ధనికులైనా వారు మానవత్వానికి ప్రతీకలే. అలాంటి ఆదర్శప్రాయుల జీవితాలను వర్ణించడంలోనూ కవి చేసిన ప్రయత్నం అభినందనీయం. ఓ ఇల్లాలి జీవితాన్ని పరికిద్దామా -
“అందరూ తిన్నాకే, తను తింటుంది ఏ శేషమో
అయినా కడుపులో పందికొక్కు గంతులేయకపోదు ”
అంటూ
“ఆవిడమెల్లో రవ్వలహారం లేదు,
ఉన్నదల్లా గవ్వల హారమే, ఏ ఆదిమ యుగాల అవశేషమో ! ”
అన్న ఈ పంక్తుల్లో మన సమాజ ఆలోచనా తీరుపై కూడా వ్యంగబాణం విసిరారా కవి అనిపిస్తోంది.
నేటి సమాజ స్థితిగతులను, లోకంతీరునూ వర్ణించే కవితలు ఐదారున్నాయి. ‘పెళ్ళి రిసెప్షన్’, ‘చెన్నపురి నానీల్లో’ కొన్ని నానీలు, ‘నేడు-రేపు’ లాంటి కవితలు ఇందుకు కొన్ని ఉదాహరణలు.
సమాజ స్థితిగతులను చిత్రించే కవితల్లో కేవలం పేదరికం, బతుకు కష్టాలే కాదు, విద్యా, విజ్ఞాన, పర్యావరణ రంగాల స్థితిగతులు, మానవసంబంధాలు, ఈ సంబంధాల్ని పెంచి పోషించే మంచి భావాల కుసుమాల గుభాలింపు కూడా ఈ సంపుటిలో మనం ఆస్వాదించవచ్చు.
పిల్లలంటే కవికి గల ఆప్యాయత, అనురాగాల్ని నాలుగైదు కవితలు స్పష్టంగా చూపిస్తాయి.
“పాప చెంత ఉంటే
ఏ పనీ సాగదు
పాప చెంత లేకుంటే
ఏ పనీ తోచదు “
ఇంత చిరు కవితలో ఎంత చక్కటి అనుభూతి.
“పిల్లలు నన్ను
వేలు పట్టుకొని నడిపిస్తారు
బాల్యంలోకి
ఆ చిట్టిచేతుల్లో ఎంత సృజనాత్మకతో !
కాకపోతే,
కనిపించిన ప్రతివస్తువూ ఆటబొమ్మవుతుందా?
ఆ లేతగొంతుల్లో ఎంత మాధుర్యమో !
కాకపోతే
ప్రతిమాటా గుండెలోతుల్ని మీటుతుందా? ”
‘నేనూ – పిల్లలూ’ అనే కవితలో కవి భావాల్ని చదివి ఆస్వాదించాలే కానీ వర్ణించడం సాధ్యపడదు.
అదే కవితలో –
“పిల్లలు మన దగ్గర నేర్చుకోవడం సరే,
వాళ్ళ దగ్గర మనమెంత నేర్చుకొంటాం ! ”
ఇది మనందరికీ తెలిసిన యథార్థమే అయినా మనమెప్పుడైనా ఆలోచిస్తామా?
“పిల్లల్లారా !
వందకు కనీసం వందైనా కొట్టెయ్యాలి….”
అంటూ ‘పరీక్షా సమయం’ శీర్షికన ఒక కవితలో
“ఇప్పుడు విద్యంటే
మెదడులోకి కుక్కకున్నదంతా
కాగితాల మీద కక్కేయడమే
ఎంతో కొంత తెలుసుకోవడం కాదు,
అన్నీ తెలిసినట్లు అభినయించగలగడమే !..”
అని వ్యంగ్య బాణాన్ని సంధించిన కవి చదువుకు నిర్వచనాన్నీ ఇచ్చారు ఆ కవితలోనే-
”అసలు చదువంటే అంకెల గారడీ కాదు
జ్ఞాన మంటి కేవలం సమాచార పరిజ్ఞానం కాదు
ఓ ప్రాథమిక సత్యాన్ని గుర్తుంచుకొందాం
చదువంటే సదసద్వివేక చతురత !”
‘చీలినదారి’ శీర్షికన మరో కవితలో
“నిష్ఠురమ్మని తెలిసికూడా
నిజం చెప్పక తప్పదిపుడు ”
అంటూ
“విశ్వమంతా వేలికొసపై
ఉన్నదంటూ ఊకదంపుడు
ఇరుపొరుగుల పేర్లు కూడా
తెలియదంటూ నంగినవ్వులు ! ”
అని విమర్శిస్తూ జ్ఞానానికొక నిర్వచనాన్నిచ్చారు కవి –
“ప్రకృతి ధర్మం తెలిసి మసలుటె
జ్ఞానమన్నది తెలయదేమో ” నని
‘చరమ వాక్యం’ శీర్షికన ఒక చిట్టి కవిత –
“..“అనగనగా ఒక అడవి....”
“తాతా, అడవంటే ?”
“......ప్చ్”..”
ఈ చిరు కవిత అడవంటే చెప్పలేని, చూపలేని స్థితిలా నేడు దాపురించిన పర్యావరణ వైపరీత్యం వైపు సంకేతంలానూ.. మరోలా ఆలోచిస్తే, ఆంగ్లం మోజులో మనం పిల్లల్ని కాన్వెంట్లకు పంపుతుంటే “అడవంటే?” అని పిల్లలడిగితే “..ప్చ్” ఇదికూడా తెలియదేమో అని భావించిన తాత నిట్టూర్పులాగానూ ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించే ఇలాంటి చిట్టి కవితలెన్నో ఉన్నాయి ఈ సంపుటిలో.
‘పునరపి’ శీర్శికన ఛందోబద్దమైన ఐదు పద్యాల్లో చూలాలైన సతి పుట్టింటికెళుతుండగా ఎడబాటు ఓర్వని పతి హృదయలహరిని వర్ణిస్తూ
“సుదతికే కాదు మరుజన్మ చూలరయగ
పతికి కూడ యనుకొనుచు ప్రణయమూర్తి
ప్రసవ వేదన తాననుభవము చేసె
రెండు డెందమ్ము లొకటైన ప్రేమ జగతి ” అంటూ
ప్రేమే జగతికి మూలం అన్న సందేశాన్ని చెప్పకనే చెప్పారు కవివర్యులు. సంపుటి శీర్షిక కూడా ఇదే కావటంతో ఈకవిత కవి దృష్టలో చాలా ముఖ్యమైందే. ఈ కవిత లోతు పాతుల్ని ఆస్వాదించే పనిని సమయాభావం కారణంగా మీకే వదిలేస్తున్నాను. చిట్టి చిట్టికవితల్లో ఇమిడిన సందేశాలెన్నో ఉన్నాయి. ప్రతి కవితలో దాగిన భావాన్ని శోధించడం అరగంటలో సాధ్యం కాదు.
సందేశాత్మక కవితలు, నైతిక విలువల్ని ప్రభోదించే కవితలూ, ప్రగతిని కీర్తించే పంక్తులూ, విడ్డూరాల్ని విమర్శించే స్వరాలూ, పాఠకుల మనోఫలకంపై ఎన్నో దృశ్య చిత్రాలను ప్రతిభింబింపజేసే మరెన్నో భావాలూ ఉన్నాయిందులో.
“ఊపిరిలో నవత, నెత్తురులో సమత
ఇది వినా కవి కాలేడు కదా ! ”
నవత్వమే కాదు సమత్వాన్ని కాంక్షించేవాడే కవి అనే భావాన్ని వ్యక్తపరచిన కవి నిజంగానే ప్రశంసనీయులు.
“కన్నుకానని కులవివక్ష
భరతజాతికి యావజ్జీవ శిక్ష ”
అంటూ మన వ్యవస్థలో ఉన్న అవ్యవస్థనూ, దుర్వవస్థనూ దాపురికంలేకుండా వెలుగులోకి తెచ్చే ప్రయత్నమూ చేశారు కవి ఈ సంపుటిలోని కవితల్లో. ఈ కృతిలో మొత్తం 35 కవితలున్నాయని మొదట్లో నేనన్నాను, శీర్షికల దృష్ట్యా ఆ సంఖ్య సరియైనదే కానీ నిజానికి స్వతంత్ర భావాల్ని వ్యక్తపరిచే చిట్టి కవితలన్నిటినీ లెక్కబెడితే మొత్తం 91 ఉన్నాయ్.
ఇంత చిరుసంపుటిలో అన్ని భావాల్ని నింపిన కవి నిజంగా ప్రతి క్షణంలో కవితల్లోనే జీవిస్తుంటాడా? కవులను గురించిన ఇటువంటి భావనే ఓ కవితలో ఉందికూడా.
“కడల్న సూడుమీ
లోన నిండ సోగం వేల ఉంది
ఎప్పుడుమేఁ కవిపాడుగునే ఉణ్ణుఁ ”
తమిళనాట వ్యవహారంలో ఉన్న తెలుంగు, అంటే తమిళప్రాంత తెలుగు మాండలికాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కొన్ని కవితల్ని అదే మాండలికంలో రాశారు.
కవి ఎప్పడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. కవి చైతన్య కలం నుండి జాలువారే ప్రతి సిరా చుక్కా పాఠకుల మెదళ్ళకు, దగాపడిన బ్రతుకులకు చైతన్యదీప్తి అంటే అతిశయోక్తి కాదేమో.
కొనియాడదగ్గ ఎన్నో భావాలు, సుగుణాలూ ఉన్న ఈ కవితా సంపుటి ఒక సగటు పాఠకునిగా నేను చదివినప్పుడు ఇందులో కొన్ని విషయాలు నాకు రుచించలేదు. కొన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను, కవి వ్యంగ్యంగా అన్నప్పటికీ ఎందుకో నాకు నచ్చని ఒక సన్నివేశం - మింగడానికి మెతుకు కరువున్న సందర్భంలాంటిచోట మెడలో రవ్వల హారం గురించిన కల్పన. ఓ నానీలో వాడిన ‘దిగువతరగతి జనం’ అనే పదం. లయ కొరకే వాడినట్లనిపించినా దీని బదులుగా మరేదైనా పదం వాడి ఉంటి మంచిదనిపించింది. వాడుక భాషలో వ్రాస్తున్నా అక్కడక్కడా వాడిన గ్రాంధిక పదాలు అల్పజ్ఞులైన నాలాంటి తెలుగువారికి అర్థమయ్యేట్టుగా లేవు. చెన్నపురి నానీల్లో మహాకవి భారతీయార్ ను స్మరించినా తిరువళ్ళువర్ ను విస్మరించారనిపించింది. మరుముద్రణలో మరో నానీ జోడిస్తే బాగుంటుంది.. హైకూల్లో చివరి మూడు హైకూల ఛందస్సు ప్రామాణికంగాలేదనిపించింది. ఈ సంపుటిలో దాదాపు అచ్చుతప్పుల్లేవనవచ్చు, ఒకటి రెండు తప్ప.
తొంబైతొమ్నిదిపాళ్ళ సుగుణాలున్న ఈ సంపుటిలో నేను ప్రస్తావించాలనుకున్నా రుచించని విషయాలు మొత్తం ఒక శాతం కంటే కూడా తక్కువే. దాదాపు ఇదే విషయాన్ని అంగీకరించారు శృంగవరపుకోటకు చెందిన డా।। రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు గారు ఈ సంపుటికొరకు రాసిన పీఠికలో. పీఠిక సారాంశంగా ఆయన రాసిన రెండు మాటలు చివరిగా మీముందుంచాలను కొంటున్నాను. ఎందుకంటే నేనూ ఈ కవితా సంపుటి మొత్తాన్ని చదివి సమీక్ష రాసిన పిమ్మటనే ఈ పీఠికను చదివాను గావున.
“ ‘మాట పట్టింపు’న్న కవి, ప్రకృతిని ప్రేమించగలగే కవి, మనిషి గురించీ, జీవితం గురించీ ఆలోచించే కవి, కవిత్వాన్ని, అనుభూతి, చింతనాశీలతల కలనేతబట్టలా అల్లగల కవి ఇందులో కనిపిస్తారు…” అని రెంటాలగారి వాక్కు.
చెన్నపట్నంలో తెలుగు భాష పరిరక్షణకూ, వికాసానికీ అహరహం తపించిన కీ.శే. పేరిశెట్ల భాస్కరుడు గారి స్మృతికి ఈ కవితాసంపుటిని అంకితమిచ్చి తెలుగు భాషా సేవకుల పట్ల వెంకటేశ్వర గారు చూపిన ఆదరణ అనుకరణీయం. ఈ కృతిని ప్రచురించిన జనని సాంఘిక సాంస్కృతిక సమితి ప్రయత్నం అభినందనీయం.
కృతి- ‘పునరపి’ (కవితా సంపుటి) కవి – ఉప్పలధడియం వెంకటేశ్వర
పుటలు – 68 మూల్యం – రూ.40/-
ప్రతులకు – జనని (సాంఘిక సాంస్కృతిక సమితి), 13/53, రెండవ వీధి, వాసుకి నగర్, కొడుంగైయూరు, చెన్నై – 600 118
(తిరుపతిలో ప్రజాశక్తి బుక్ హౌస్, విశాలాంధ్ర బుక్ హౌస్ లలోకూడా ఈ కవితా సంపుటి ప్రతులు లభించును)---
1. శ్రీశ్రీ - ఖడ్గసృష్టి – విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్
1 comment:
sameexa chaalaa baagundi
Post a Comment