Friday, March 27, 2009

విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు




ఉగాది
తెలుగు జనావళి స్వాగతిస్తున్న
విరోధి నామ ఉగాది
సర్వజనుల జీవితాలను సుఖాల పొదరిల్లులా మార్చి
విరోధపు విషఛాయలను దూరం చేసి
వసంతపు ఆనందాలను అందించాలని ఆకాంక్షిస్తూ....
విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


Thursday, March 5, 2009

భర్తృహరి సుభాషితం

- మన్నవ గంగాధర్, చెన్నయ్.

విద్యనిగూఢగుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్
విద్యనృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే.

వ్యక్తికి విద్యయే ధనము, దాచి ఉంచగలిగినది అదియే, విద్య సకల భోగ కారకము, కీర్తి, సుఖము కలుగజేయును, విద్య గురువు వలె మార్గము చూపును, విదేశాలకు వెళ్లినపుడు చుట్టమువలె సాయపడును. విద్య కారణంగానే రాజ సత్కారాలు లభిస్తాయి, అటువంటి విద్య లేనివాడు మనిషే కాడు అని భర్తృహరి సుభాషితం.

Monday, March 2, 2009

పుస్తక సమీక్ష



విశ్వ చైతన్యంలో
సత్య దర్శనం

- ఏ. రాధిక


సత్యశోధనే ధ్యేయంగా, సత్ చింతనే లక్ష్యంగా కస్తూరి భాస్కర రావు గారి కలం నుండి జాలువారిన వ్యాస సంపుటి ‘విశ్వ చైతన్యంలో సత్య దర్శనం’ దార్శనిక చింతనతో నిండిన విశిష్ట కృతి. కేరళలోని కొచ్చిన్ లో నివాసముంటున్న భాస్కర రావు గారు తేట తెలుగులో విరచించిన ఈ సద్గ్రంథలో పరమాత్మ స్వరూపాన్ని ఒక నూతన దృక్కోణంలో ఆవిష్కరించారు. ఆత్మ స్వరూపాన్ని ఆవిష్కరించడంలోనైతేనేమి, సత్యమార్గాలనుపదేశించడంలోనైతేనేమి ఈయన సద్యుదాహరణల నేపథ్యంలో చక్కగా వివరించారు. శ్రీ రమణ మహర్షి ఉద్భోదలు ఈ వ్యాస సంపుటికి ఆధారం. శ్రీ రమణుడు విశ్లేషించిన వేదాంతసారాన్ని చక్కటి శైలిలో సులభ పదజాలంతో వ్యాసకర్త ఇందులో స్పష్టం చేశారు. ‘అహం’ అన్నది వ్యక్తిని ఆలోచనలకు దూరం చేస్తుందని, అది వ్యక్తి అధోగమనానికి మార్గం అవుతుందన్న విషయాన్ని తెల్పుతూ, సత్ పదార్థమైన వ్యక్తి శుద్ధ చిత్ స్వరూపంగా మిగలటం అనగా నిజమైన ఆత్మభావనగా వెలగటమన్నదానిని తెలుసుకోవటం గురించి తెల్పుటయే ఆత్మ విచారం అన్నారు.


గురు వైశిష్ట్యాన్ని ఉటంకిస్తూ గురువంటే మానవ శరీర రూపంలో అగుపించే కారుణ్య భావంతో రూపుగొన్న దైవంగా పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకూ విశ్వమెంత అభివృద్ధి క్రమంలో ఉన్నా ప్రతి వ్యక్తి తన జీవన క్రమంలో ఏదో ఒక దశలో గురు బోధనను తీసుకున్నవారే ఉంటారు. ఆత్మ తత్వమే సత్యం. ఆత్మ స్వరూపాన్ని అవగతం చేసుకున్నపుడు అజ్ఞానం అంతమై ఆనందరూపమైన పరిశుద్ధాత్మ స్వరూపం ఆవిష్కృతమౌతుందని, ఆ ఆత్మ సాక్షాత్కారానికి ధ్యానం తొలి మెట్టని పేర్కొనడం జరిగింది. ఆత్మనిష్టుడు ఆత్మ తృప్తి సాధిస్తాడు, ఆత్మ ఉన్నవాడు సాధించలేని కర్మ అన్నది ఉండదు. ఆత్మ సాక్షాత్కరం పొందిన వ్యక్తిని మోహం, వాంఛ అన్నవి దరి చేరవు. నేటి మారణకాండకు కారణమౌతున్న అసలు కారణాలు ఇవే. వీటిని జయించిన నాడు వ్యక్తి విశ్వ విజేత అవుతాడు. శాంతికాముకుడౌతాడు. స్వార్థం వికృతరూపం దాల్చి వెర్రితలలువేస్తున్న ఈ దశలో ఈ కృతి ఒక సన్మార్గదర్శిని అనడంలో అతిశయోక్తి లేదు.


సృష్టకి మూలం బ్రహ్మం. ఆ బ్రహ్మము తనేనన్న విషయం ఎరిగినరోజే విజ్ఞానము, సాధనలు, యోగములు అన్నీ ఆత్మ విజ్ఞానంలోనే లీనమౌతాయి. సత్యం, నిత్యమైన ఆనందం వస్తువుల్లో లేనే లేదు, పరమాత్మలోనే ఉంది. ఆ స్థితిలో బాధ, సంతోషం ఉండవు. తటస్థ స్థితికి, ప్రశాంతమైన స్థితికది మూలం. అందులో ఉన్నది కేవలం ఆనందం. ఏ భక్తి మార్గమైనా బోధించే సన్మార్గాన్ని ఆచరించటమే మనం చేయవలసినది.


అనాదిగా దైవశక్తికీ, జీవుడికీ మధ్య సంఘర్షణ జరుగుతోంది. శివత్వానికి, జీవత్వానికి, దైవత్వానికి అహంకారానికి నడుమ జరుగుతున్న ఈ అంతర్యుద్ధం అంతమయ్యే రోజున సృష్టిలో బాధ అన్నమాటే ఉండదు. నవవిధ భక్తితో, భగవంతుని ప్రసన్నం చేసుకొనుటకు భక్తుడు చేస్తున్న ప్రయత్నాలే భక్తి మార్గం. వీటన్నింటి సమాహారమే వేదాంతసారం. నేనన్నది మిథ్య. తానే బ్రహ్మస్వరూపమన్న నిజం తెలియజేయడమే ఈ వ్యాస సంపుటి మూల ఉద్దేశమనిపిస్తుంది. మన పురాణాలు, పవిత్ర గ్రంథాల వాస్తవ సారాంశమూ అదే.


విశ్వం ఒక జ్యోతి స్వరూపం. జీవులంతా చివరికి ఒకే పదార్థంలో లీనమౌతారు. ప్రతిదీ కర్మస్వరూపం. ప్రతి జీవికి తన కర్మ నిర్ధారణ జరిగి ఉంటుంది. ఏ వ్యక్తి కర్మరాహిత్యాన్ని కలిగి ఉండడు. ప్రతి జీవి కర్మలు చేస్తాడు. దాని ఫలాన్ని సైతం అనుభవిస్తాడు. మన భవిష్యత్తును నిర్ణయించేది భగవంతుడే. జరగాల్సింది సక్రమంగా, సకాలంలో జరుగుతుంది. జీవి ఏంచేయాలన్నా ఆయన అంగీకారం అవసరం. మహర్షుల బోధనలు, పవిత్ర గ్రంథాల ఉద్బోధలు అన్నింటి సారం ఈ సంపుటి సంకల్పం. అంతా అగోచర రూపదర్శనమే. సర్వేజనో సుఖినో భవంతు అన్నదే సమగ్రసారం.


‘జ్ఞాన గంగోత్రి అరుణాచలం’ అన్న వ్యాసంలో రమణ మహర్షి జననం, బాల్యం, జ్ఞానోదయం, అరుణాచలప్రవేశం మున్నగు విషయాలు పేర్కొన్నారు. ఈ సంపుటిలోని మొత్తం 48 వ్యాసలలో 43 వ్యాసాలు తెలుగులోను, 5 ఆంగ్లంలోను ఉన్నాయి. తెలుగులో చివరి వ్యాసం ఆది శంకరాచార్యులను గురించినది. ఇంద్ర ధనుస్సులోని ఏడు రంగులు నయన ప్రియమైనట్లు మనోహరమైన మహావాక్య భావాలు సులలితంగా ఉదహరించారు. ఈ వ్యాస సంపుటిలోని పలు వ్యాసాలు ‘విశ్వప్రకాశం’, ‘శ్రీరామకృష్ణ ప్రభ’, ‘జ్ఞానదర్శని’, ‘త్రివేణి’, ‘చిత్సుధ’, ‘యథార్థ భారతి’, ‘వేదాంతభేరి’ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో ప్రచురితమైనాయి.


ఈ కృతి ఆరంభ పుటల్లో ‘ఉపాసనీయం’ అనే శీర్షికన శ్రీ అక్కిరాజు రమాపతి రావు గారు తమ భూమికలో ఏకం సత్ విప్రా బహూదా వదంతి అనే ఆర్శవాక్యాన్ని నిరూపించే ప్రకృష్ట ప్రయత్నంగా ఈ వ్యాససంపుటిని కొనియాడారు. “స్థూలంగా ఈ సంకలనం రమణోపనిషత్తు, సూక్ష్మంగా ఆత్మ రమణ వేదాంతం, దాంతం, శాంతం అనే పథ ప్రదర్శకరదీపిక. శ్రీ కస్తూరి భాస్కరరావు గారు చాలా మంది సాధన తత్పురులలో ఒకరు. వచసు, మనసూ ఉపనిదాకృష్టం చేసినవారు. రమణ శ్రమణ మనసనిధి ధ్యాసల పట్ల తత్పరులు.” కస్తూరి భాస్కరరావు గారు ‘కారుణ్య స్రవంతి’ శీర్షికన తమ ముందుమాటలో సత్యశోధనలో తోచిన విషయాల్ని సహృదయులతో పంచుకొని ఆనందించాలనే ఆకాంక్షతో ఈ కృతిని వెలువరించానట్లు సెలవిచ్చారు.


శ్రీ కస్తూరి భాస్కరరావు గారు పదవీ విరమణ పొందిన చిత్రలేఖనోపాధ్యాయులు. ఈయన ప్రవాసాంధ్రులైనప్పటికీ తెలుగు భాషాభివృధ్ధి దిశగా కృషి చేస్తుండటమే కాక ఆధ్యాత్మిక లోకంలో చిరకాలం నిలిచిపోయే ఇలాంటి మరిన్ని సంకలనాలనందించ గలరని నా ఆకాంక్ష.


‘విశ్వ చైతన్యంలో సత్య దర్శనం’రచయిత కస్తూరి భాస్కర రావు, ప్రతులకు – నవోదయ బుక్ హౌస్, ఆర్య సమాజం ఎదురు వీధి, బడీ చౌడి, హైదరాబాదు, పుటలు – 216, మూల్యం – 100 రూ.