- డా. ఎస్. బషీర్, చెన్నై / DR.S.BASHEER,CHENNAI
విరోధినామ సంవత్సరానికి వీడ్కోలు !
వికృతి నామ సంవత్సరానికి స్వాగతాలు!!
చైత్ర శుద్ధ పాడ్యమిన ఉగాది శుభారంభాలు
తెలుగు వారికి చంద్రమానం,
తమిళులకు సౌరమానం ప్రకారం శ్రీకారాలు !
తెలుగు వాళ్లకు -ఉగాది
కన్నడిగులకు -యుగాది
తమిళ్ళులకు- పుత్తాండు
మలయాళీలకు- విషు
మరాఠీయులకు-గుడీపడ్వా
పంజాబీలకు -బైసాఖి
బెంగాలీలకు -పొయలా-బైసాఖి
వేడుకలు వేరైనా, పండుగ ఒకటే !
కొంగొత్త ఆశలకు, విన్నూత్న ఆశయాలకు
కొత్తదనానికి శుభదినం
కొత్త సంవత్సరానికి ఆహ్వానం !
మంచి-చెడు, సుఖదుఃఖాల
చిరునవ్వు -కన్నీళ్ళ, ఆనంద-విషాదాల
కాల చక్ర పరిభ్రమణంలో అన్నిఆకులే !
బతుకు తెరపై మూడు కాలాలు
ఆరు ఋతువులుగా ఓ సంవత్సరం
మెరుపులా సాగుతున్న జీవనయానం
అన్నింటా నిర్నిరోధమే!
వసంతాల నవయవనసోయగాలు
మత్తకోకిలల కుహుకుహురవాలు
మధురిమ తెలుగుపలుకుల తియ్యదనాలు
ప్రతిఎదలోగుస గుసలాడుతున్నాయి
తెలుగు లోగిళ్ల పచ్చతోరణాలు
స్వాగతం పలుకుతున్నాయి
ఈ ఉగాది .......
ఉదాత్త మనోభావాలకు
మహత్తర ఆశయాలకు కావాలి ఆది !
విష సర్పాలకు, విషాదాలకు చెయ్యాలి సమాధి !
సనాతన ధర్మ సాంప్రదాయాలకు ఈ దేశం అనాది !
అందరిబంగారు కలలకు రావాలి సన్నిధి !
మానవ జీవనానికి దొరకాలి సుఖశాంతుల పెన్నిధి !
నేడు మహిళాలోక సంపూర్ణ సాధికారసౌధానికి నాంది !
భావితరాలకు వేయాలి గట్టి పునాది ఈ ఉగాది.