Saturday, August 23, 2008

బాల సాహితి BALA SAHITI



శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు...


Janmastami Greetings...


ఉప్పలధడియం అన్నపూర్ణ



చిన్నారి చిత్రకారిణి ఉప్పలధడియం అన్నపూర్ణ కలం నుండి జాలువారిన వర్ణచిత్రం

Friday, August 15, 2008

వెబ్ లోకం

వెబ్ లోకం


వెబ్ విశ్వంలో తెలుగు ఏ స్థానంలో ఉందో ఆలోచించి తెలుగు వ్యాప్తికై నేను సైతం కృషిచేయగలనని సంకల్పించే తెలుగువీరుల చైతన్యం కోసమే ‘వెబ్ లోకం’ శీర్షిక. సాహితి పాఠకులలో వెబ్ పరిజ్ఞానాన్ని వికసింపజేయటానికి ఉద్దేశించిన ఈ శీర్షిక లో ధారావాహికంగా ప్రచురితమయ్యే వ్యాసాల పరంపరలో మొదటి వ్యాసం ‘వెబ్ లో తెలుగు’ చదవగలరు.

వెబ్ లో తెలుగు

- డా. సి. జయ శంకర బాబు

వెబ్ విశ్వంలో తెలుగు స్థానం గురించి కొన్ని వివరాలు తెలుసుకొని, ఆపై తెలుగు అభిమానుల తక్షణ కర్తవ్యం గురించి ఆలోచిద్దాం.

కంప్యూటర్లు పుట్టిన నాటినుండి వాటి సాంకేతిక పరిజ్ఞానానికి అనువైన భాషగా ఆంగ్లం వర్ధిల్లుతోంది. ఇది మనందరికీ సంతోషకరమైన విషయమే. ఆంగ్లేయులపాలనలో మనకబ్బిన ఆంగ్లభాషా పరిజ్ఞానం మనల్ని కంప్యూటర్ రంగంలోనూ రాణిస్తున్నదేశాల్లో ఒక ప్రముఖ దేశంగా భారతదేశాన్ని నిలిపేందుకు తోడ్పడింది. ఈ పరిజ్ఞానాన్ని మన భాషలకు కూడా అందజేసి మన సంస్కృతి సౌరభాలను విశ్వవ్యాప్తం చేసేందుకు, వెబ్ విశ్వంలోనూ మన భాషల ఆనవాల్లు శాశ్వతంగా ఉండేలా ప్రయత్నించటం మన కర్తవ్యం. అత్యంత అభివృద్ధి చెందిన జపాన్, చైనాలాంటి దేశాలకంటే ముందు మనదేశంలో కంప్యూటర్ వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టగలిగాము. మనకంటే ఆలస్యంగా తమ దేశంలో కంప్యూటర్లకు స్థానం కల్పించిన చైనా ఆదర్శాన్ని గురించి కూడా మనం ఈ క్షణంలో స్మరించటం ముదావహం. చైనీయులు తమ భాషకు స్థానంలేని కంప్యూటర్లకు తమదేశంలో స్థానంలేదంటూ ప్రతినబూని మరీ సాధించారు. మనం ఆంగ్లంలోనే సరిపుచ్చుకున్నా నేడు వెబ్ విశ్వంలో మన భాషల స్థితిగతులేమిటో ఆలోచిస్తే మనకు ఆవేదన కలుగక మానదు.

భారతీయ భాషలకు వెబ్ విశ్వంలో స్థానం దక్కిందని మనం సంతోషంచినా, మనమంతా సమైక్యంగా ముందుకు కదలటంలేదనే సత్యాన్ని గుర్తించవలసి ఉంది. అదెలా అంటే నిన్నటివరకూ మనభాషలకుపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వలన మనం వెబ్ విశ్వంలో విస్తరిస్తున్నామని సంతోషించినా, మనమందరం ఉపయోగిస్తున్నది మాత్రం ఉమ్మడి పరిజ్ఞానం కాదన్నది నిజం. ఉదాహరణకు తెలుగు పత్రికలు, ఇతర మాధ్యమాల వెబ్ సైట్లలో యూనికోడ్ ను ఏ కొందరో ఉపయోగిస్తున్నారు. వారు ఉపయోగిస్తున్న ఇతర కోడ్ కలిగిన ఫాంట్ లో ఉన్న కొంత సామగ్రిని సర్చ్ ఇంజన్లు వెదుకుతున్నప్పటికీ వీటి వల్ల మన తెలుగు లభించివలసిన ఉమ్మడి ప్రయోజనం మాత్రం అందటం లేదు. పరివర్తనీయత, పఠనీయత వంటి సమస్యలు తలెత్తున్నాయి. ఒక్కో వెబ్ సైట్ కు ఒక ఫాంట్ ను ఉపయోగిస్తుంటే అన్ని ఫాంట్లను మన కంప్యూటర్ లలో డౌన్ లోడ్ చేసుకోవటం కూడా అంత వ్యావహారికం కూడా కాదు. ఫాంటు లేకుండా ఈ-మెయిల్, చాటింగ్ వగైరా కూడా సాధ్యపడదు. ఇలాంటి మరెన్నో కారణాలు, అసౌకర్యాలున్నప్పటికీ యూనికోడ్ వైపెందుకో మన వారి శీతకన్ను. మన తెలుగు పత్రికల వారిని కూడా ఈ దిశలో ముందడగు వేయమని మనమంతా కోరవలసిన బాధ్యాతా ఉంది.

మన తెలుకు సాహితీ సంపద వెబ్ విశ్వంలో వెలుగొందాలంటే మనమందరం తప్పకుండా యూనికోడ్ ను ఉపయోగించాలి. వెబ్ విశ్వంలో మన తెలుగు ఏ మాత్రం వెనుక పడకూడదన్న చైతన్యం కలిగిన అసంఖ్య తెలుగు వీరులు తమ బ్లాగులద్వారా, ఎందరో వీకీపీడియన్లు జ్ఞానయజ్ఞంలోనూ స్వచ్ఛందంగా దివారాత్రాలు శ్రమిస్తుండం వలన నేడు కూడా మనం సగర్వంగా వెబ్ భాషలందునూ తెలుగు లెస్స యని చాటగలుగుతున్నాము. ఈ విషయం మరెందరిలోనో చైతన్యం నింపేదిశగా కూడా మనం ఇప్పుడే కదలాలి. సాహితి అండతో ‘వెబ్ లోకం’ కూడా అదే ప్రయత్నంలో ఉంది.

‘వెబ్ లోకం’ శీర్షికన ప్రచురితమయ్యే తదుపరి వ్యాసం – ‘తెలుగుకు యూనికోడ్ ను ఎలా ఉపయోగించాలి?’ తప్పక చదవగలరు.

(వెబ్ లోకం web lokam by Dr. C. Jaya Sankar Babu)

Thursday, August 14, 2008

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో....

పతాకావిష్కరణ
- మన్నవ గంగాధరప్రసాద్, చెన్నపురి.
నేను
విహంగాన్ని
అపరిమిత స్వేచ్ఛాతత్వాన్ని
సున్నిత హృదయసంబరాన్ని.
నేను
ఒక సామాన్య మానవుణ్ని
సతతకివితాగాన లోలున్ని
బాధాసర్గశత కావ్యాన్ని
ప్రతిరోజూ మరణించే ఉదయాణ్ని
కాగితంపై జీవించే కలాన్ని
కాలాన్ని జయించే బలాన్ని
మది పుష్పాలను పండించే పొలాన్ని
దుర్మార్గహనన యజ్ఞవాటిక సిద్దం చేసే హలాన్ని.
కల్మశోన్మాధ వ్యతిరేక సైన్యాల యుద్దగీతాన్ని
కలసి కలలుగనే మనసుల భవితకు మార్గాన్ని.
సంకుచిత మనోదుర్గుణాలను పెకలించే గునపాన్ని
సమాజవనిలోని క్రూర వృక్షాల దహించే.. దావానలాన్ని.

Monday, August 4, 2008

మన తెలుగు manatelugu


మన తెలుగు పద్యాలు

మన తెలుగు వాజ్ఞ్మయం సదా స్మరించదగిన, గర్వించదగిన పద్యసంపదకు భాండాగారం. బహుశా దక్షిణాది భాషలలో ఈ విషయంలో తెలుగు తరువాతే మరే ఇతర భాషల పద్యాలైన అనటంలో అతిశయోక్తి లేదు. అటువంటి పద్యసంపదకు వారసులమైనందుకు కనీసం కొన్ని ఆణిముత్యాల్లాంటి తెలుగు పద్యాలను గురించి తెలుసుకొనడం తెలుగువారిగా మన కనీసధర్మం. ఈ ధర్మాన్ని నెరవేర్చడంలో మీకు తోడ్పడేందుకు చెన్నపురి తెలుగుకవి శ్రీ మన్నవ గంగాధర ప్రసాద్ సమ్మతించారు. సాహితి ద్వారా మన తెలుగు శీర్షికలో ప్రతి నెల ఆణిముత్యం లాంటి ఒక తెలుగు పద్యాన్ని పరిచయం చేయనున్నారు. ఈ సత్ప్రయత్నానికి మన్నవగారు అభినందనీయులు. ఈ క్రమంలో మొదటి ఆణిముత్యం ...

గజేంద్రమోక్షం

ఉ. ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపలనుండు లీనమై
యెవ్వనియందుడిందుఁబరమేశ్వరుఁడెవ్వడు మూలకారణం
బెవ్వఁడనాదిమధ్యలయుఁడెవ్వఁడు సర్వము దాన యైనవాఁ
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.


ఎవనివలన జగము పుట్టి, పెరిగి, నశించుచున్నదో, ఎవ్వడు అన్ని జీవులకూ ప్రభువో, ఎవ్వడు అన్నిటికీ మూలకారణమో, ఎవరికి ఆది, అంతములు లేవో, ఎవడు సర్వాత్మస్వరూపుడో... అట్టి భగవంతుని నన్ను కాపాడమని వేడుకుంటున్నాను.

గజేంద్రమోక్షం (పోతనామాత్య విరచితం) నుండి.

బాలసాహితిBALASAHITI

కథ

కోతి తెలివి


సి. విజయేంద్ర బాబు


ఒక ఊరిలో ఒక కోతి ఉంది. అది చాలా తెలివైనది. అది ఒక పెద్ద మర్రిచెట్టు ఎక్కింది. అది మర్రి తొర్రను చూసింది. దానిలో పక్షులు కవకవ అరుస్తున్నాయి. ఎందుకు అరుస్తున్నాయా అని చూసింది. ఒక పాము చెట్టుపైకి ఎక్కడం చూసింది. కొమ్మపై కూర్చున్న గద్దను పిలిచింది.


"నీకు పామంటే ఇష్టం కదా" అంది.


" అవును" అంది గద్ద.


"మరి తిను" అంది కోతి.


గద్ద పామును పట్టుకొని ఎగిరింది. ఆవిధంగా కోతి తెలివితో పక్షి పిల్లల్ని కాపాడింది.

చేతకాని వారిని కష్టాలనుండి తప్పించడం మంచి గుణం.

Friday, August 1, 2008

అంతరంగం


దేశ భాషలందు తెలుగు లెస్స యన్న అలనాటి శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి వాక్కును నేడు కూడా దేశ వెబ్ భాషలందు తెలుగు లెస్సయని నిరూపించిన తెలుగువీరులందరికీ కృతజ్ఞతాభివందనములతో సాహితి అక్షరయజ్ఞానికి నేడు శ్రీకారం చుడుతోంది. ప్రతి తెలుగు వీరుడు వెబ్ విశ్వంలో తెలుగువ్యాప్తికి తనవంతు అక్షరయజ్ఞానికి నడుంబిగించాలని ఆహ్వానం పలుకుతోంది సాహితి.
నేడు ఆధునిక విజ్ఞాన వికాసంతోపాటు భాషల మధ్య సాంకేతిక అంతరాలు పెరిగిపోతున్నాయి. అంతర్జాలానికి అనువైన భాషగా మొదటినుండే రూపొందిన ఆంగ్లం అన్నిభాషలూ ఎదగనంత ఉన్నతస్ధాయికి ఎదిగిపోయింది. మన భాషలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చకపోయినా కంప్యూటర్లను ఆదరించి మనం సైతం ఆంగ్లంలోనే పనిచేస్తూ ఉండటం వల్లనే ఈ అంతరాలు మరింత పెరిగిపోయాయి. యూనికోడ్ ఆవిష్కారంతో వెబ్ విశ్వంలో భారతీయ భాషల వికాసానికి, మన భాషలమధ్య సాంకేతిక అంతరాలను నిర్మూలించడానికి మార్గం సుగమమైంది. మనం తెలుగును వెబ్ విశ్వంలో దిగంతాలవరకూ వ్యాపింపజేసేందుకు అనువైన సమయం ఆసన్నమైనప్పటికీ తెలుగుపత్రికలు, ఇతర ప్రచారమాధ్యమాల వెబ్ సైట్లలో యూనికోడ్ ను ఉపయోగించకపోవటంవల్ల మనం తెలుగు వ్యాప్తికి తీరని అన్యాయం చేస్తున్నామన్నది అక్షర సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకొని యూనికోడ్ ని ఉపయోగిస్తూ సుసమృద్ధమైన తెలుగు భాషా సంపదనూ, వాజ్ఞ్మయాన్నీ విశ్వవ్యాప్తంచేయటానికి మనం తక్షణం ముందడుగు వేయాలి. వీకీపీడియాలో ఎందరో నిస్వార్థ తెలుగువీరులు తెలుగు కీర్తిపతాకం ఎగురవేయటానికి నిరంతరం శ్రమిస్తుండటంచేత దేశభాషలందు తెలుగులెస్సయన్న వాక్కు వీకీపీడియాలోనూ నిరూపితమైంది. ఇంతటితో తెలుగు వెబ్ విశ్వంలో వికసించిందని సంతృప్తిచెందటం పొరపాటే. అన్నింటా మనం ముందున్నామనే సంతోషం మనకు మిగలాలంటే వెబ్ విశ్వంలో తెలుగుభాషకు తిరుగులేని వేదికగా యూనికోడ్ ను మనమందరం ఆదరించి ప్రయోగించవలసిన సమయమిదే. కంప్యూటర్ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి అందరి సహకారంతో వెబ్ విశ్వంలో తెలుగు చైతన్యదీప్తిని ప్రసరింపజేయటానికీ, వెబ్ విశ్వంలో తెలుగు భాషా సాహిత్యాలవికాసంతో పాటు మానవతా విలువలను కాపాడటంలోనూ తనవంతు సహాయం ఉడుతాభక్తితో నెరవేర్చే సంకల్పంతో సాహితి ఈరూపంలో మీ ముందుకు వచ్చింది.
మంచి తెలుగు సాహిత్యాన్ని డిజిటలైజ్ చేస్తూ, తెలుగువెలుగులూ, మానవతావిలువలూ దిగంతాలకు ప్రసరింపజేసే ప్రయత్నంలో సాహితికి తమరి ఆదరాభిమానాలే కొండంత అండ. వెబ్ విశ్వంలో ఈ అక్షర యజ్ఞానికి మీరు సైతం నడుం బిగించాలని సాహితి ఆహ్వానం పలుకుతోంది. తేనెలొలుకు తెలుగుభాషా మాధుర్యాన్ని అందరికీ పంచేందుకు తమరు చేసే ప్రతి ప్రయత్నానికి సాహితి తనవంతు చేయూతను తప్పక అందిస్తుంది.

కొన్ని రచనలతో నేడు ప్రారంభమైన సాహితి నిరంతరం కొత్త రచనలతో మీకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. మీరు ఏ రచన విషయంలో నైనా ఆ రచన చివరన ఉన్న comments పై క్లిక్ చేసి అక్కడే తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వ్యక్తపరచవచ్చును. నిత్యమూ సాహితి సందర్శిస్తూ తమ అమూల్యమైన అభిప్రాయాలను అందించవలసినదిగా కోరుతూ...
అక్షర అభివందనాలతో...


శ్రీవైష్ణవి విజయ్ రాధిక జయ శంకర బాబు

బాల సాహితి



అంజలి

- ఉప్పలధడియం రవితేజ

ఆ.వె. అమరజీవి వలన ఆంధ్ర రాష్ట్రము వచ్చె
దీని మరువరాదు తెలుగువారు
ఎక్కడున్నగాని ఎల్లప్పుడతనిని
తలచుకొనుట మనకు ధర్మమగును.

ముత్యాల సరములు

- ఉప్పలధడియం రవితేజ

పల్లెలోనూ పట్నమందూ
తేజుగాడూ అన్నపూర్ణా
ఒంటెమీదా ఓడలోనూ
తేజుగాడూ అన్నపూర్ణా
అప్పడాలూ, ఆవకాయా
ఎర్రగడ్డా, గనుసుగడ్డా
కందగడ్డా, ఉర్లగడ్డా
నాకుమాత్రం పట్టదోయ్.